వెంకట్ రెడ్డికి క్లీన్ చిట్... పాదయాత్రకి గ్రీన్ సిగ్నల్‌!

February 16, 2023


img

కాంగ్రెస్‌-బిఆర్ఎస్‌ పొత్తు అనివార్యమంటూ కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకొంటుందని భావిస్తే, అందరూ కలిసి ఆ వివాదాన్ని చల్లార్చేశారు. ఆయన మాటలని రేవంత్‌ రెడ్డి, వి.హనుమంతరావు వంటి సీనియర్ నేతలు బహిరంగంగానే తప్పు పట్టారు. కానీ తన మాటలని మీడియా వక్రీకరించిందనే వెంకట్ రెడ్డి వాదనని కాంగ్రెస్‌ అధిష్టానం అంగీకరించడమే కాకుండా ఈ నెల 28వ తేదీ నుంచి నల్గొండ జిల్లాలో ఆయన పాదయాత్ర చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్‌ కూడా ఇచ్చేసింది. సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఆయనకి అండగా నిలిచి కాంగ్రెస్‌ పార్టీకి వీరవిధేయుడు అని సర్టిఫికేట్ ఇచ్చారు. 

గాంధీ భవన్‌లో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు థాక్రేని కలిసిన వచ్చిన తర్వాత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర కాంగ్రెస్‌ బలాలు, బలహీనతలు ఆయనకి వివరించి వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కనీసం 70 సీట్లు సాధించేందుకు నావంతు గట్టిగా కృషి చేస్తానని చెప్పాను. త్వరలో నేను కూడా సంగారెడ్డిలో పాదయాత్ర మొదలుపెడతాను,” అని చెప్పారు. 

ఏఐసీసీ ప్రోగ్రామ్స్ కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ భారత్‌ జోడో పాదయాత్రకి కొనసాగింపుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ నేతలు ‘హాత్ సే హాత్ జోడో’ పాదయాత్రలు చేపడుతున్నారు. తెలంగాణలో కూడా అందరూ తమ తమ జిల్లా లేదా నియోజకవర్గాలలో పాదయాత్రలు చేయబోతున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ నెల 28నుంచి, మార్చి 1 నుంచి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, మార్చి 2 నుంచి భట్టి విక్రమార్క పాదయాత్రలు మొదలుపెట్టబోతున్నారు,” అని చెప్పారు.


Related Post