జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి నిన్న రెండు వింత అనుభవాలు ఎదురయ్యాయి. దారిలో లక్ష్మీనారాయణపురంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఓ గీతకార్మికుడు ఎదురయ్యాడు. కాస్త కల్లు రుచి చూడమని కోరడంతో వైఎస్ షర్మిల మొహమాటపడుతూనే కాస్త కల్లు తాగారు. “ఎలా ఉందమ్మా?” అని అతను అడిగితే ఆమె బాగుందని సమాధానం చెప్పారు. అయితే మరికాస్త తాగమని కోరాడు. కానీ వైఎస్ షర్మిల నవ్వుతూ సున్నితంగా తిరస్కరించి ముందుకు సాగిపోయారు.
ఆ తర్వాత మరోచోట వైఎస్ షర్మిల మహిళలతో మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం, పాలనపై విమర్శలు గుప్పిస్తుండగా, చుట్టూ ఉన్న జనంలో ఓ యువకుడు మేడమ్... మా ఊరికి వచ్చి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడొద్దు. ఆయన మాకు చాలా చేస్తున్నాడు,” అంటూ వారించబోయాడు. వైఎస్ షర్మిల మొదట షాక్ అయినా, ఆ యువకుడిని ఉద్దేశ్యించి “చెప్పు...మీ ఊరికి కేసీఆర్ ఏం చేశాడో... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఎన్ని కట్టించాడు? పొలాలకి ఎన్ని గంటలు నీళ్ళు ఇస్తున్నాడు? 24 గంటలు ఇస్తున్నాడా?” అంటూ నిలదీశారు.
అప్పుడు ఆ యువకుడు “డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించలేదు కానీ నీళ్ళు ఇస్తున్నాడు మా కేసీఆర్...” అని సమాధానం చెప్పాడు. “అయితే ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో నీకు తెలుసా?ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు దేవాదుల, ఎస్సార్ఎస్పీ తెస్తే దాని వలన మీకు సాగునీళ్లు వస్తున్నాయి తప్ప కేసీఆర్ ఒక్క చుక్క నీరు మీకు ఇవ్వలేదు,” అంటూ వైఎస్ షర్మిల వివరించారు.
అయితే ఆ యువకుడి మాటల్లో కేసీఆర్ పట్ల అభిమానం కనిపిస్తోంది. అతను చెప్పిన సమాధానం చాలా ఆలోచింపజేస్తుంది. “ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా మా ఊరికి నీళ్ళు రాలేదు. కేసీఆర్ వచ్చాకే వస్తున్నాయి,” అని సమాధానం చెప్పాడు. ఇంకా ఏదో చెప్పబోతుంటే, పోలీసులు అతని చేతిలో నుంచి మైక్ లాక్కొని పక్కకి తీసుకుపోయారు. కానీ ఆ యువకుడు చెప్పినది వాస్తవమని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దేవాదుల, ఎస్సార్ఎస్పీతో సాగునీరు అందుతున్నట్లయితే తెలంగాణ ఏర్పడక మునుపు రైతులు సాగునీటికి ఎందుకు కటకటలాడిపోయారు?అప్పులు చేసి మరీ వేలాది బోరుబావులు ఎందుకు వేయించుకోవలసి వచ్చింది? రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకొనేవారు?