ఈరోజు ఉదయం విశాఖ నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఎన్‌ఎస్సీ నగర్ వద్ద పట్టాలు తప్పింది. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు.... బోగీలు దెబ్బ తినలేదు. చాలా సంతోషమే. అయితే ఈ ప్రమాదంతో పట్టాల సామర్ధ్యంపై సందేహం కలిగేలా చేస్తోంది.
సగటున గంటకి 57కిమీ వేగంతో ప్రయాణించే గోదావరి ఎక్స్‌ప్రెస్ వేగాన్ని తట్టుకోలేకపోయిన పట్టాలు, అంతకి రెట్టింపు వేగంతో అంటే గంటకి సుమారు 120-130 కిమీ వేగంతో ప్రయాణించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వేగాన్ని తట్టుకోగలవా? ఒకవేళ గోదావరి ఎక్స్‌ప్రెస్ బదులు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తునప్పుడు పట్టాలు తప్పితే?
ఈరోజు జరిగిన ప్రమాదానికి కారణం ఏమిటో రైల్వే అధికారులకే తెలుసు. కనుక ఆ సమస్యని వారు సరిచేస్తున్నారు. తర్వాత యధావిధిగా రైళ్ళు నడుస్తాయి. కానీ గంటకి 120-130 కిమీ వేగంతో దూసుకుపోయే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇదే పట్టాలపై నడిపించడం సరైన నిర్ణయమేనా?అనే సందేహం కలుగుతుంది.
ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది కనుక దాని మెప్పు కోసం లేదా ఒత్తిళ్ళ కారణంగా రైల్వే అధికారులు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు నడిపించడానికి ఈ పట్టాలు సరిపోతాయని లేదా వాటిని నడిపించడం కోసం ట్రాక్ సామర్ధ్యం పెంచామని చెప్పి ఉండవచ్చు. కానీ అవే పట్టాల ప్రయాణిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ నేడు పట్టాలు తప్పింది. కనుక వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ పట్టాలపై నడిపించడం సరైన నిర్ణయమేనా? రేపు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా ఇలాగే పట్టాలు తప్పి జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు విజయవంతంగా నడుస్తుండటం చాలా సంతోషమే. కానీ ఇటువంటి ప్రమాదం జరిగితే అప్పుడు రైల్వేశాఖ పట్టాల సామర్ధ్యం, ప్రయాణికుల భద్రత గురించి ఏం సమాధానం చెపుతుంది?