రాజకీయ నాయకులు అప్పుడప్పుడు నోరు జారీ ఏదో మాట్లాడేయటం తర్వాత తూచ్! నేను అలా అనలేదు. మీడియా నా మాటలని వక్రీకరించిందని నిందించడం పరిపాటే. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా అదే చేశారు. తెలంగాణ ఎన్నికలలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని, కనుక బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవలసిందే అని అన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీకి 60 సీట్లు రావని కనుక హంగ్ అసెంబ్లీ ఖాయమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సిఎం కేసీఆర్‌తో, బిఆర్ఎస్ పార్టీతో యుద్ధాలు చేస్తుంటే, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బిఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తుల గురించి మాట్లాడటంతో కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహించింది. దీనిపై ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు థాక్రేకి సంజాయిషీ ఇచ్చుకొన్నారు.
తాను బిఆర్ఎస్‌తో పొత్తులు పెట్టుకొంటామని చెప్పలేదని రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులని బేరీజు వేసి పార్టీల బలాబలాల గురించి చెప్పానని, రాహుల్ గాంధీ చెప్పిన్నట్లుగా సెక్యులర్ పార్టీతో పొత్తులు పెట్టుకొంటామని చెప్పనన్నారు. కానీ బిజెపి, మీడియా తన మాటలని వక్రీకరించి కాంగ్రెస్-బిఆర్ఎస్ పొత్తులు పెట్టుకోబోతున్నాయని దుష్ప్రచారం చేశాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంజాయిషీ ఇచ్చుకొన్నారు.
కానీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాటలు కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని వాదిస్తున్న కాంగ్రెస్ నేతల వాదనలకి బలం చేకూర్చుతున్నట్లు ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై ఆగ్రహంగానే ఉంది. మునుగోడు ఉపఎన్నికల సమయంలో కూడా ఆయన పార్టీకి తీరని ద్రోహం చేశారు.
కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి ఎట్టి పరిస్థితులలో గెలవలేరని కనుక బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించమని కాంగ్రెస్ శ్రేణులకి ఫోన్లు చేసి చెప్పారు. అందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆయనకి షోకాజ్ నోటీస్ కూడా పంపింది. కానీ ఆయనపై చర్యలు తీసుకొనే ధైర్యం లేక ఉపేక్షించింది. ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేవిదంగా మాట్లాడారు. ఈసారైనా కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకోగలదో లేదో?