సీనియర్ కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఏ పార్టీకి 60 సీట్లు మించి రావని, హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కాంగ్రెస్‌లో అందరూ కలిసికట్టుగా పనిచేస్తే 40-50 సీట్లు గెలుచుకోవచ్చునని అన్నారు. కానీ గెలుపు గుర్రాలకి మాత్రమే టికెట్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత కేసీఆర్‌కి కాంగ్రెస్ మద్దతు తీసుకోకతప్పని పరిస్థితి ఏర్పడవచ్చని అన్నారు. కనుక ఎన్నికల తర్వాత ఏర్పడబోయే సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉండబోతోందని అన్నారు.
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్ననే “భయంకరమైన కాల నాగునైనా కౌగలించుకొంటాము కానీ ఎట్టి పరిస్థితులలో కేసీఆర్‌తో చేతులు కలపబోము...” అని అన్నారు. ఇంతలోనే వెంకట్ రెడ్డి కేసీఆర్‌తో పొత్తులు అనివార్యమని చెప్పడం విశేషం.
వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి కనీసం 100 సీట్లు గెలుచుకొని పూర్తి మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్, ఈసారి తెలంగాణలో కేసీఆర్‌ని గద్దె దించి బిజెపి అధికారంలోకి వస్తుందని బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితరులు చెపుతున్న సంగతి తెలిసిందే. కానీ బిజెపి వద్ద అంతమంది అభ్యర్ధులే లేరనేది బహిరంగ రహస్యం. కనుక అది అధికారంలోకి రాలేకపోయినప్పటికీ బిఆర్ఎస్‌కి గట్టి పోటీ ఇవ్వబోతోంది.
ఇక బిఆర్ఎస్‌కి మిత్రపక్షంగా ఉన్న మజ్లీస్ పార్టీ కూడా ఓసారి 15 ఎమ్మెల్యేలతో శాసనసభలో అడుగుపెడతామని, మరోసారి 50 స్థానాలలో పోటీ చేస్తామని చెపుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎంత బలహీనపడినప్పటికీ దాని నేతల సొంత బలంతో కనీసం 15-20 సీట్లు గెలుచుకొనే అవకాశం ఉంది. ఇక వచ్చే ఎన్నికలలో టిడిపి, వైఎస్సార్ తెలంగాణ పార్టీలు కూడా ఓట్లు చీల్చబోతున్నాయి. ఇవి కాక స్వతంత్ర అభ్యర్ధులు ఉందనే ఉంటారు. ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ 100 సీట్లు సాధించడం అసాధ్యమే అని భావించవచ్చు.
అయితే సిఎం కేసీఆర్ తన వద్ద కొన్ని బ్రహ్మాస్త్రాలున్నాయని పదేపదే చెపుతున్నారు. వాటిలో ఒకటి ‘రైతులకి నెలనెలా పెన్షన్ చెల్లింపు.’ ఒకవేళ ఇటువంటి బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తే బిఆర్ఎస్ పార్టీ విజయావకాశాలు మెరుగుపడవచ్చు. కానీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొంటున్నట్లు కాంగ్రెస్‌కి అంత సీన్ ఉండకపోవచ్చు. ఎప్పటిలాగే కాంగ్రెస్ టికెట్ మీద గెలిచినవారిలో సగం మంది బిఆర్ఎస్ పార్టీలో చేరిపోవచ్చని గత అనుభవాలు చెపుతున్నాయి. కనుక ముందుగా ఈ సమస్యపై దృష్టి పెడితే మంచిదేమో?