ఉచిత విద్యుత్‌పై కేంద్రం తాజా ఆదేశాలు... రాష్ట్రాలకి షాక్!

February 14, 2023


img

దేశంలో రెండు తెలుగు రాష్ట్రాలతో సహా అనేక రాష్ట్రాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌, వివిద వర్గాలకు విద్యుత్‌ సబ్సీడీలు ఇస్తున్నాయి. అయితే విద్యుత్‌ సరఫరా జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ పంపిణీ సంస్థలకి పూర్తి సొమ్ము చెల్లించలేకపోవడం లేదా వాయిదాల పద్దతిలో చెల్లిస్తుండటంతో అవి తీవ్రంగా నష్టపోతున్నాయి. వాటి బకాయిలు పెరుగుతున్న కొద్దీ అవీ ధర్మల్ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకి (ఎన్‌టీపీసీ)లకు చెల్లించలేకపోతున్నాయి. దాంతో అవి తమకి బొగ్గు సఫరా చేస్తున్న సింగరేణి వంటి సంస్థలకి బకాయిలు చెల్లించలేకపోతున్నాయి. ఈవిదంగా ఉచిత విద్యుత్‌, రాయితీ విద్యుత్‌ వలన వరుసగా పలు సంస్థలు నష్టపోతుండటంతో, కేంద్ర ప్రభుత్వం ఈ చెల్లింపు విధానంలో మార్పు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇకపై అన్ని రాష్ట్రాలు ముందుగానే డిస్కమ్‌లకి పూర్తి సొమ్ము చెల్లించి విద్యుత్‌ పొందాలని ఆదేశించింది. ఒకవేళ రాష్ట్రాలు ముందుగా చెల్లించేందుకు నిరాకరించినా, పూర్తి సొమ్ము చెల్లించకపోయినా విద్యుత్‌ సరఫరా చేయరాదని ఆదేశించింది. 2022 నుంచి 2032 వరకు ఈ విధానం అమలులో ఉంటుందని తెలిపింది. 

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వ్యవసాయానికి 100 శాతం ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తోంది. ఇంకా కులా వృత్తులని ప్రోత్సహించేందుకు దోబీఘాట్లు, క్షౌరశాలలు తదితరులకి విద్యుత్‌ రాయితీలు ఇస్తోంది. దీని ప్రకారం తెలంగాణ ప్రభుత్వం నెలకి సుమారు రూ.1,275 కోట్లు డిస్కమ్‌లకి ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా?ఒకవేళ అంగీకరిస్తే నెలనెలా అంతా సొమ్ము చెల్లించగలదా? చెల్లించకపోతే ఉచిత, రాయితీ విద్యుత్‌ వినియోగదారుల పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలకి త్వరలోనే సమాధానం లభించవచ్చు.


Related Post