జనగామ సమీకృత కలెక్టర్ కార్యాలయం పైకెక్కి ఓ దంపతులు సోమవారం ఆత్మహత్యాయత్నం చేసుకొనే ప్రయత్నం చేయగా పోలీసులు వారికి నచ్చజెప్పి కింద తీసుకువచ్చారు.
జిల్లాలో పసరమడ్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగరావు, రేవతి దంపతులకి గ్రామంలో వారసత్వంగా వచ్చిన 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. బ్రతికుతెరువు కోసం తాము 5 ఏళ్ళ క్రితం ములుగు జిల్లాకి వెళ్లిపోవడంతో తహశీల్దార్ రమేష్, వీఆర్‌వో క్రాంతి కలిసి తమ భూమిని వేరేవారి పేరిట రిజిస్ట్రేషన్ చేసేశారని ఆరోపించారు. తమ భూమి కోసం తహశీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం ఉదయం 11 గంటలకి మళ్ళీ కలెక్టర్‌ని కలిసి వారు తమ గోడు మొర పెట్టుకొన్నారు. కానీ ఎప్పటిలాగే కలెక్టర్ ఈ సమస్య పరిష్కారానికి సమయం పడుతుందని సమాధానం ఇవ్వడంతో తమ భూమి తమకి ఎన్నటికీ దక్కదనే తీవ్ర నిరాశనిస్పృహలతో దంపతులు కలెక్టరేట్ భవనంపైకి ఎక్కి ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పు పెట్టుకోబోయారు. అక్కడే ఉన్న పోలీసులు, ప్రజలు వారిని బ్రతిమాలి కిందకు దిగేలా చేశారు. తర్వాత వారితో కలెక్టర్ మాట్లాడారు. ఈ సమస్య కోర్టులో ఉన్నందునే తాము ఏమీ చేయలేకపోతున్నామని, కనుక కోర్టు తీర్పు వచ్చేవరకు ఓపిక పట్టాలని నచ్చజెప్పి ఇంటికి పంపించేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సుమారు రెండేళ్ల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూసర్వే చేయించి రైతులకి భూయాజమాన్యం నిర్దారిస్తూ పాసు పుస్తకాలు ఇచ్చింది. ఆ తర్వాత ధరణి పోర్టల్ కూడా తీసుకువచ్చింది. ఈ రెంటితో రాష్ట్రంలో భూముల అక్రమలావాదేవీలని పూర్తిగా కట్టడి చేశామని ప్రభుత్వం పదేపదే గర్వంగా చెప్పుకొంటుంది.
మరి ఇంత పకడ్బందీ ఏర్పాట్లు చేసి ప్రభుత్వమే రైతులకి వారి భూముల యాజమాన్య హక్కులు దృవీకరించినప్పుడు, నిమ్మల నర్సింగరావు, రేవతి దంపతుల భూమిని ఓ తహశీల్దార్, వీఆర్‌వో కలిసి ఇతరులకి ఎలా అమ్మేయగలిగారు?ధరణీలో నిమ్మల కుటుంబం పేర్లున్నట్లయితే వాటిని తహశీల్దార్, వీఆర్‌వో ఎలా మార్చగలరు?
ఇటీవల శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్కలు ధరణి పోర్టల్లో ఇటువంటి సమస్యలని లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీశారు కూడా. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిరుపేదలకు తక్షణం న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.