ప్రధాని మోడీపై శాసనసభలో కేసీఆర్‌ ఓ పిట్టకధ!

February 13, 2023


img

ఆదివారం శాసనసభ ముగింపు సమావేశాలలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశ్యించి ఓ పిట్టకధ చెప్పారు. “పూర్వం తిరుమల రాయుడు అనే ఒంటి కన్ను రాజు ఉండేవాడు. ఆయనని పొగిడి నజరానాలు పొందాలని ఆశపడిన ఓ కవి, “అన్నాతి గూడి హరుడవు... అన్నాతిని గూడకూనా అసుర గురుడవు... అన్నా తిరుమలరాయా... కన్నొకటి కలదు కానీ కౌరవపతివే” అని ఓ పద్యం వినిపిస్తాడు. అది విని ఆ మహారాజు ఎంతో సంతోషపడి ఆ కవిని ఘనంగా సన్మానిస్తాడు. 

ఇంతకీ ఆ పద్యం అర్దం ఏమిటంటే, రాజా ఒక్క కన్నే ఉందని బాధపడకు. నీ భార్య పక్కన ఉన్నప్పుడు నువ్వు ముక్కంఠివి. పక్కన భార్య లేనప్పుడు ఒకే కన్ను కలిగిన రాక్షసగురువు శుక్రాచార్యుడవి. ఆ ఒక్క కన్ను ఉంది లేకపోతే కౌరవుల తండ్రి ధృతరాష్టుడివి నువ్వు...,” అని సిఎం కేసీఆర్‌ వివరించారు. అది విని సభలో అందరూ హాయిగా నవ్వుకొన్నారు. 

ప్రధాని నరేంద్రమోడీ కూడా ఇప్పుడు ఆ ఒంటి కన్ను రాజులాంటివారే అని ఆయన చుట్టూ చేరిన భజనరాయుళ్ళు కూడా ఆయనని ఆ కవిలాగే పొగుడుతూ తాము ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలు పొందుతూ, మోడీని నిలువునా ముంచేస్తున్నారని సిఎం కేసీఆర్‌ అన్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా... ఆ భజన బృందం ఇలాగే పొగుడుతూ చివరికి ప్రధాని మాజీ ప్రధాని అయ్యేలా చేస్తుందని, అప్పుడు కూడా వారు నీకేమయ్యా ఇప్పుడు నువ్వు మాజీ ప్రధానివయ్యావని పొగుడుతారని సిఎం కేసీఆర్‌ వ్యంగ్యంగా అన్నారు. 

ఇది నిజమే కావచ్చు కానీ ఈ ఒంటి కన్నురాజు కధ సిఎం కేసీఆర్‌కి కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు. ఆయన ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా బిఆర్ఎస్‌ నేతలందరూ శభాష్ శభాష్ అంటూ జేజేలు పలుకుతూ వంతపాడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారని వాదిస్తుంటారు. నిజమే! ప్రధాని నరేంద్రమోడీ కూడా దేశాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని బిజెపి వాళ్ళు కూడా చెప్పుకొంటున్నారు కదా?


Related Post