శాసనసభ సమావేశాలలో కేసీఆర్‌ నోట ఈటల భజన...దేనికో?

February 13, 2023


img

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలలో భాగంగా ఆదివారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగింది. ఈ చర్చలో సిఎం కేసీఆర్‌ పదేపదే హుజురాబాద్‌ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పేరు ప్రస్తావించడం చాలా ఆశ్చర్యకరం. వివిద సమస్యలపై ఈటల రాజేందర్‌ సభలో మాట్లాడుతున్నప్పుడు, మంత్రి హరీష్‌ రావుని వాటన్నిటినీ నోట్ చేసుకొని సమాధానాలు చెప్పాలని సిఎం కేసీఆర్‌ సూచించడం విశేషం.

ఆ తర్వాత సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ఈటల రాజేందర్‌ సూచనతోనే విద్యార్థులకి సన్నబియ్యంతో అన్నం పెడుతున్నామని  చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రభుత్వం ఆయన సలహాలని పరిగణనలోకి తీసుకొందన్నారు. రైతు రుణమాఫీ, కాలేజీలలో గెస్ట్ లెక్చరర్స్, ఆర్టీసీ బస్సుల సమస్యలపై ఆయన చేసిన సూచనలని ప్రభుత్వం సానుకూలంగా స్వీకరించి తగిన నిర్ణయం తీసుకొంటుందని సిఎం కేసీఆర్‌ చెప్పారు. 

టోల్‌ప్లాజా ఉద్యమాల సమయం నుంచి తనతో కలిసి మెలిసి పనిచేసిన ఈటల రాజేందర్‌ని సిఎం కేసీఆర్‌ ప్రభుత్వం నుంచి అత్యంత అవమానకరగా బయటకి వెళ్లగొట్టారు. ఆ తర్వాత హుజురాబాద్‌ ఉపఎన్నికలలో ఓడగొట్టి రాజకీయ సమాధి కట్టాలనుకొన్నారు. ఈటల రాజేందర్‌ మొహం చూడటానికే ఇష్టపడక ఏదో వంకతో శాసనసభ నుంచి సస్పెండ్ చేసి బయటకి పంపిస్తుండేవారు. అటువంటిది సిఎం కేసీఆర్‌ నిన్న తన ప్రసంగంలో ఈటల రాజేందర్‌ పేరుని 18సార్లు ప్రస్తావించడం, ఆయన లేవనెత్తిన సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం, ఆయన సూచనలని పరిగణనలోకి తీసుకొంటామని చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

దీనిపై ఈటల రాజేందర్‌ స్పందిస్తూ, “శాసనసభలో కేసీఆర్‌ పదేపదే నా పేరుని ప్రస్తావించడం ద్వారా నన్ను మళ్ళీ బుట్టలో వేసుకోవాలనో లేదా నాపట్ల మా బిజెపిలో అనుమానాలు కలిగించాలనో ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నాను. నన్ను అంతగా అవమానించి బిఆర్ఎస్‌ పార్టీలో నుంచి వెళ్ళగొట్టిన పెద్దమనిషి ఇప్పుడు రమ్మనగానే పరిగెతుక్కు వచ్చేస్తాననుకోవడం అవివేకం. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కోసం మనస్ఫూర్తిగా పనిచేస్తాను. రాష్ట్రంలో కేసీఆర్‌ని గద్దె దించి బిజెపిని అధికారంలో తీసుకురావడం కోసం గట్టిగా కృషి చేస్తున్నాను,” అని అన్నారు.


Related Post