రాష్ట్ర విభజన తర్వాత ఈ 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మాత్రం నానాటికీ దయనీయంగా మారిపోతోంది.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ‘అమరావతి కధలు’ చెపుతూ ఐదేళ్ళు కాలక్షేపం చేసి వెళ్ళిపోయిన తర్వాత కేసీఆర్ సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి కుర్చీని అదిష్టించిన జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణపనులు పరుగులెత్తించే బదులు పూర్తిగా అటకెక్కించేసి మూడు రాజధానులు అంటూ మూడున్నరేళ్ళుగా కాలక్షేపం చేసేశారు. మిగిలిన పుణ్యకాలం కూడా ఇలాగే పూర్తయిపోతుంది. కనుక పదేళ్లపాటు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోబోతోంది.
మూడున్నరేళ్ళ క్రితం జగన్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోన్న తొలిరోజు నుంచే అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పధకాల పేరిట ప్రజలకి (ఓటర్లకి) లక్షల కోట్లు పంచిపెట్టేస్తున్నారు. దీంతో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకి నెలనెలా సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరుకొంది. కనుక ఇప్పట్లో ఏపీ కోలుకోవడం చాలా కష్టమేననిపిస్తుంది. అయితే ఇందుకు వైసీపీ మంత్రులు ఏమాత్రం చింతిస్తున్నట్లు లేదు కూడా.
తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలని రప్పించడంలో, రాష్ట్రంలో అన్ని జిల్లాలకి ఐటి రంగాన్ని విస్తరించడంలో, మునిసిపల్ మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో మౌలికవసతుల కల్పనలో ఎంత చొరవ తీసుకొంటారో అందరికీ తెలుసు. ఆయన చొరవతోనే నేడు హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేసింగ్ ఈవెంట్ జరిగింది.
ఈ రేస్ చూసేందుకు ఏపీ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి కూడా వచ్చారు. రేస్ చూసిన తర్వాత ఆయనని విలేఖరులు “ఏపీలో ఎప్పుడు ఫార్ములా ఈ-రేసింగ్ ఈవెంట్ నిర్వహిస్తారు?” అని ప్రశ్నించినప్పుడు తమ ప్రభుత్వ అసమర్దతని, వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొంటూ, “కోడి గుడ్డు పెడుతుంది. దానిలో నుంచి పిల్ల బయటకి వస్తుంది తప్ప కోడికి కోడి పుట్టదు కదా?అలాగే ఏపీలో కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది. అది పెరిగి పెద్దదై కోడిగా మారడానికి కొంత సమయం పడుతుంది. ఏదో ఓ రోజున మా విశాఖ రాజధానిలో కూడా తప్పకుండా ఫార్ములా ఈ-రేసింగ్ ఈవెంట్ నిర్వహిస్తాము,” అని చెప్పారు.