శనివారం శాసనసభ ప్రశ్నోత్తర సమయంలో మెట్రో రైలు ఛార్జీల పెంపు గురించి సభ్యులు అడిగిన ప్రశ్నకి మంత్రి కేటీఆర్ చెప్పిన సమాధానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎప్పటిలాగే ముందుగా కేంద్ర ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తూ, “దేశంలో చిన్న చిన్న నగరాలకి మెట్రో ప్రాజెక్టులు మానూరు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అభివృద్ధి చెందుతున హైదరాబాద్ నగరానికి మాత్రం ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదు.
కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా శంషాబాద్ విమానాశ్రయం వరకు మూడేళ్లలో మెట్రోని పొడిగిస్తాం. పాతబస్తీలో మెట్రో పొడిగింపుకి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది గనుకనే బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించాము. మెట్రో ఛార్జీల పెంపుకి మేము వ్యతిరేకం. మెట్రో ఛార్జీలు సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండాలని కోరుకొంటున్నాము. ఇదే విషయం మేము మెట్రో అధికారులకి తెలియజేశాము కూడా. మెట్రో ఛార్జీలు ఆర్టీసీ బస్సు ఛార్జీలతో సమానంగా ఉంచాలని మేము కోరుకొంటున్నాము. ఇష్టం వచ్చిన్నట్లు పెంచుతామంటే మేము సహించబోము,” అని మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పారు.
హైదరాబాద్ మెట్రో నిర్వహణ వ్యయం నానాటికీ పెరిగిపోతున్నందున మెట్రో ఛార్జీల పెంపుకి హైదరాబాద్ మెట్రో సంస్థ ఓ కమిటీని వేయగా అది అన్ని అంశాలని పరిగణనలోకి తీసుకొని మెట్రో టికెట్ ఛార్జీలు పెంపు అనివార్యమని తేల్చి చెప్పింది. మెట్రో టికెట్ ఛార్జీ ఏమేరకు పెంచాలో కూడా ఆ కమిటీయే సిఫార్సు చేసింది. కనుక జనవరి నుంచి మెట్రో ఛార్జీలు పెరుగుతాయని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఫిభ్రవరిలో 11 రోజులు గడిచిపోయినా కమిటీ సిఫార్సు మేరకు టికెట్ ఛార్జీలు పెంచలేదు. బహుశః రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి కారణంగా వెనక్కి తగ్గి ఉండవచ్చని అర్దమవుతోంది. అయితే మెట్రోని ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు మంజూరు చేసింది. ఆ హామీతోనే టికెట్‌ని ఛార్జీల పెంపు నిలిచిందేమో?