మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాబోయే ఎన్నికలలో ఖమ్మం నుంచి పోటీ చేయడానికి బిఆర్ఎస్ టికెట్ లభించదని గ్రహించిన తర్వాత ఆయన అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ముందుగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలతో తర్వాత కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఖమ్మంలో బిజెపికి బలమైన అభ్యర్ధులు లేనందున ఆ పార్టీ కూడా ఆయనని ఆహ్వానిస్తోంది. కనుక ఈ మూడు పార్టీలలో ఏదో ఓ దానిలో చేరుతారనుకొంటే, ఆయన తాడేపల్లి వెళ్ళి ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అవడం ఆశ్చర్యకరం. గతంలో ఆయన వైసీపీలో ఉన్నారు కనుక జగన్‌తో సాన్నిహిత్యం ఉంది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాను ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదు. కానీ తాను ఏ పార్టీలో చేరినప్పటికీ తన అనుచరులైన జారే ఆదినారాయణ అశ్వారావుపేట నుంచి, బానోత్ విజయని వైరా నుంచి శాసనసభకి పోటీ చేస్తారని ప్రకటించారు. అంటే తనకి ఖమ్మం లోక్‌సభ టికెట్, వారికి అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాలలో టికెట్స్ ఇవ్వాలనే షరతుకి అంగీకరించిన పార్టీలోనే శ్రీనివాస్ రెడ్డి చేరాలనుకొంటునట్లు భావించవలసి ఉంటుంది.
కాంగ్రెస్, బిజెపి, వైఎస్సార్ టిపిలు ఈ షరతుకి అంగీకరించకపోవడం వలననే ఆయన తాడేపల్లి వెళ్ళి ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారా? కానీ తెలంగాణతో సంబందంలేని సిఎం జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కలిశారో?ఏం చేయబోతున్నారో?ఆయనే స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.