ఈ ఏడాది డిసెంబర్‌లోగా తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఎప్పటిలాగే మజ్లీస్ 7-8 స్థానాల నుంచే పోటీ చేస్తుందనుకొంటే ఈసారి 15 మంది ఎమ్మెల్యేలతో శాసనసభలో అడుగుపెడతామని మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించడం ప్రకపంపనలు సృష్టిస్తోంది. ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో మజ్లీస్ పార్టీ రాష్ట్రంలో 50 స్థానాలలో పోటీ చేయబోతోందనే మరో వార్త తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే బిఆర్ఎస్, మజ్లీస్ పార్టీల మద్య దూరం పెరిగిందా? జాతీయ రాజకీయాలలో కేసీఆర్‌తో కలిసి ఓవైసీలు పనిచేయదలచుకోలేదా?అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నిన్న హైదరాబాద్‌లో విలేఖరులతో మాట్లాడుతూ, “ఎన్నికలకీ ఇంకా చాలా సమయం ఉంది కనుక మజ్లీస్ ఎన్ని స్థానాలలో పోటీ చేయాలనే దానిపై అక్టోబర్ నెలలో నిర్ణయం తీసుకొంటాము. కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించడాన్ని మేము స్వాగతిస్తున్నాము. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం అధికారిక కార్యక్రమం. కనుక మేము తప్పక దానిలో పాల్గొంటాము. ఆరోజు జరుగబోయే బహిరంగసభ బిఆర్ఎస్ సొంత వ్యవహారం. దానికి రమ్మనమని మాకు ఆహ్వానం రాలేదు. కనుక దాని గురించి మేము ఆలోచించవలసిన అవసరం లేదు,” అని అన్నారు.