వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్స్, మ్యూటేషన్స్ ప్రక్రియని సులబతరమ్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ని ప్రవేశపెట్టగా, దాని వలననే రాష్ట్రంలో అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నిన్న శాసనసభలో వాదించారు. ఈ సందర్భంగా ఆయనకి మంత్రి కేటీఆర్‌కి మద్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.
ధరణి పోర్టల్లో ఉన్న లోపాల గురించి శ్రీధర్ బాబు ప్రస్తావిస్తూ వాటిని సరిచేయాలని ప్రభుత్వానికి సూచించారు. ధరణిలో ఆర్ధిక లావాదేవీలు పూర్తయిన తర్వాత కూడా కొనుగోలుదారుల పెర్లకి బదులు అమ్మకందారుల పేర్లే కనబడుతుండటంతో రైతులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయవలసివస్తోందని, తమ డబ్బు, భూమి పోయాయనే ఆవేదనతో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని శ్రీధర్ బాబు వివరించారు. ధరణి పోర్టల్‌పై మొత్తం 5 లక్షల పిర్యాదులు పెండింగులో ఉన్నమాట వాస్తవమా కాదా? అయినా ప్రభుత్వం వాటిని ఎందుకు పరిష్కరించడం లేదు? ధరణి పోర్టల్‌లో సాంకేతిక లోపాలని ఎందుకు సరిచేయడం లేదు?రైతులు ఇబ్బందులు పడుతున్నా, ఆత్మహత్యలు చేసుకొంటున్నా ప్రభుత్వం పట్టించుకోదా?అని గట్టిగా నిలదీశారు.
సాంకేతిక లోపాల కారణంగా ధరణి పోర్టల్‌తో రైతులు ఇబ్బందులు పడుతున్నారనే విషయం ప్రతిపక్ష సభ్యుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినప్పుడు, మంత్రి కేటీఆర్ దానిని సానుకూలంగా స్వీకరించి తప్పక పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఉంటే చాలా హుందాగా ఉండేది. కానీ ధరణి పోర్టల్లో చిన్న చిన్నలోపాలని భూతద్దంలో చూపుతూ మా ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారంటూ, ఎదురుదాడి చేశారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెవెన్యూ వ్యవస్థని భ్రష్టు పట్టించేసింది. అసలు ధరణి పోర్టల్‌పై మీ పార్టీ వైఖరి ఏమిటి?అంటూ ఎదురు ప్రశ్నించారు.
మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ని రద్దు చేస్తామని శ్రీధర్ బాబు ఊహించని సమాధానం చెప్పడంతో శాసనసభలో బిఆర్ఎస్ సభ్యులు తీవ్రంగా ఆక్షేపించారు. ధరణి పోర్టల్లో లోపాలపై చర్చ జరుగుతున్నప్పుడు అధికార పార్టీ దానికే పరిమితమైతే, సభలో పరిష్కారం లభించి ఉండేది. కానీ అధికార పార్టీ సభ్యులే చర్చని ఈవిదంగా పక్కదారి పట్టించడంతో అధికార, ప్రతిపక్షాల రాజకీయవాదోపవాదాలతో చర్చ ముగిసిపోయింది.