కేసీఆర్‌తో జగ్గారెడ్డి భేటీ... పార్టీ మారేందుకేనా?

February 09, 2023


img

సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీలో ఉండలేకపోతున్నారు. అలాగని బయటకి వెళ్ళలేకపోతున్నారు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన ఇంకా ఇబ్బందిగా ఉంటున్నారు. 2018 ఎన్నికలకి ముందు, ఆ తర్వాత కూడా ఆయన టిఆర్ఎస్‌ పార్టీలోకి వెళ్ళాలని ప్రయత్నించారు కానీ సాధ్యపడలేదు. ఈ నేపధ్యంలో  ఆయన గురువారం ఉదయం శాసనసభలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. 

జిల్లా అభివృద్ధి పనుల గురించి ముఖ్యమంత్రితో చర్చించడానికి, మెట్రో రైలుని సంగారెడ్డి వరకు పొడిగించాలని కోరేందుకే కలిశానని చెప్పారు. ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన్న పార్టీ మారబోతున్నట్లు కాదని చెప్పారు. వివిద పార్టీల ఎంపీలు ప్రధానమంత్రిని ఏవిదంగా కలుస్తుంటారో తాను కూడా అదేవిదంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసి సంగారెడ్డిలో జరగాల్సిన అభివృద్ధి పనుల  గురించి మాట్లాడానని చెప్పారు.     

జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటునప్పటికీ రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. కనుక పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటూ తన జిల్లా, నియోజకవర్గంలో మాత్రం పట్టు నిలుపుకొంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లోగా తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. కనుక ఒకవేళ కేసీఆర్‌ అంగీకరించి టికెట్‌ ఇస్తానంటే వెంటనే బిఆర్ఎస్‌ పార్టీలో చేరిపోవడానికి జగ్గారెడ్డి వెనకాడకపోవచ్చు. కానీ సంగారెడ్డిలో బిఆర్ఎస్‌ నేతలు కూడా అందుకు అంగీకరించాల్సి ఉంటుంది. వారు అంగీకరించకపోవడం వలననే బిఆర్ఎస్‌లో చేరలేకపోతున్నారు. లేకుంటే ఎప్పుడో చేరిపోయుండేవారు. కనుక ఈ తాజా భేటీలో కేసీఆర్‌ ఆయనకి ఏమైనా హామీ ఇచ్చారా లేదా అనేది రాబోయే రోజుల్లో మెల్లగా తెలుస్తుంది.


Related Post