బిఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై తన పోరాటాన్ని చాలా ఉదృతం చేసిన్నట్లు కనపడుతోంది. పార్లమెంటు సమావేశాలలో బిఆర్ఎస్ ఎంపీలో కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తుంటే, ఇక్కడ శాసనసభలో మంత్రి హరీష్ రావు, మండలిలో ఎమ్మెల్సీ కవితతో సహా పలువురు బిఆర్ఎస్ నేతలు ప్రధాని నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు.
నాందేడ్ సభలో సిఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీతో సహా దేశ ప్రజలందరికీ అర్దమయ్యేందుకు హిందీలో ప్రసంగిస్తూ, కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో వివరించారు. దేశంలో సహజవనరులను సమర్ధంగా వినియోగించుకోకపోగా, అదానీ కంపెనీకి లబ్ధి చేకూర్చడం కోసం ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకొంటున్న బొగ్గుని రాష్ట్రాలు తప్పనిసరిగా కోనాలని లేకుంటే బొగ్గు కోటాలో కోతలు విధిస్తామని బెదిరిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. దేశ సంపదని, ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడుకొనే బదులు అన్నిటినీ అమ్మేస్తూ అదానీకి దోచిపెడుతున్నారని సిఎం కేసీఆర్ ఆరోపించారు.
మంత్రి హరీష్ రావు నిన్న శాసనసభ బడ్జెట్ చర్చలో మాట్లాడుతూ, “మోడీ సర్కార్ పాలనలో జీడీపీ అడుగంటిపోయి ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. పసిపిల్లలు త్రాగే పాలు మొదలు వంటగ్యాస్ వరకు ప్రతీదాని ధరలు పెంచేస్తున్నారు. సామాన్య ప్రజల కష్టార్జితాన్ని ఆదానీకి దోచిపెడుతున్నారు. దేశంలో పేదలు నిరుపేదలుగా మారుతుంటే ఆదానీని మోడీ పెంచి పోషిస్తున్నారు. కేవలం 8 ఏళ్లలో రూ.160 లక్షల కోట్లు అప్పులు చేసి దేశాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారు. కేంద్ర ప్రభుత్వం చేతగానితనం వలన రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మోడీ, వరుసగా ప్రభుత్వ రంగా సంస్థలన్నిటినీ అయినకాడికి అమ్మేస్తూ వాటిలో ఉద్యోగులని కూడా రోడ్డున పడేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలని కూల్చివేస్తూ దొడ్డిదారిలో అధికారం చేజిక్కించుకొంటున్నారు. అన్ని రంగాలలో దేశాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారు,” అని అన్నారు.
అంతకు ముందురోజు మంత్రి కేటీఆర్ కూడా శాసనసభలో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా “ఇటువంటి అసమర్ధ ప్రధాని మనకి అవసరమా?” అంటూ చాలా తీవ్రంగా విమర్శించారు.
ప్రధాని నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకొని బిఆర్ఎస్ నేతలు ఎందుకు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు?అంటే రెండు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.
1. ప్రధాని నరేంద్రమోడీని ఎదుర్కొని నిలబడగల నాయకుడు సిఎం కేసీఆర్ మాత్రమే అని యావత్ దేశానికి చాటి చెప్పడం. తమ వాదనలని బలంగా వినిపించడం ద్వారా దేశప్రజలకి బిఆర్ఎస్, కేసీఆర్ నాయకత్వం పట్ల నమ్మకం కలిగించడం.
2. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో సీబీఐ, ఈడీలు వేగం పెంచినందున ఈ కేసుతో ప్రమేయం ఉన్నట్లు ఆరోపింపబడుతున్న కల్వకుంట్ల కవితని త్వరలోనే అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించవచ్చు. కనుక ఈవిదంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం ద్వారా ఈ కేసులో వాటి దూకుడు తగ్గించాలని బిఆర్ఎస్ భావిస్తుండవచ్చు.