తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు, సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బలు!

February 08, 2023


img

బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఇవాళ్ళ ఇక్కడ హైకోర్టులో, అక్కడ సుప్రీంకోర్టులో ఒకేసారి ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ కేసు దర్యాప్తుని సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులని హైకోర్టు ధర్మాసనం కూడా సమర్ధించడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. కానీ అక్కడా ఎదురుదెబ్బ తగిలింది. 

ఈ కేసుని అత్యవసరంగా విచారించాలని, సీబీఐ దర్యాప్తుకి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే లేదా స్టేటస్-కో (యధాతధస్థితి)ని కొనసాగించాలని ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుద్రా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌ని అభ్యర్ధించారు. ఈ కేసు ఫైల్స్ తమకి అప్పగించవలసిందిగా సీబీఐ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోందని, ఒకవేళ ఈ కేసు సీబీఐ చేతిలోకి వెళితే ఈ కేసు నిర్వీర్యం అవుతుందని వాదించారు. 

కానీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌ ఈ కేసుని అత్యవసరంగా విచారణ చేపట్టడానికి, అలాగే స్టే ఉత్తర్వులు జారీ చేయడానికి నిరాకరించారు. ఈనెల 17వ తేదీన ఈ కేసు విచారణ చేపడతామని, ఒకవేళ తెలంగాణ ప్రభుత్వ వాదనలలో బలం ఉందని భావిస్తే సీబీఐకి అప్పగించిన ఫైల్స్ తిరిగి ఇప్పిస్తామని చెప్పారు. అంటే ఈ కేసు సీబీఐ చేతికి అప్పజెప్పక తప్పదన్నమాట! 

మరోవైపు ఇక్కడ హైకోర్టులో కూడా ఈరోజు ఈ కేసు విచారణ జరిగింది. ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుని నిలిపివేయాలని, మళ్ళీ సింగిల్ జడ్జ్ వద్ద విచారణకి అనుమతించాలని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ని కోరారు. కానీ అందుకు ఆయన నిరాకరించారు. 

సింగిల్ జడ్జ్ తీర్పుని సవాలు చేస్తూ హైకోర్టు ధర్మాసనానికి వచ్చిన తర్వాత మళ్ళీ సింగిల్ జడ్జ్ దగ్గరకి వెళ్తామంటే కుదరదని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్లింది కనుక సర్వోన్నత న్యాయస్థానంలోనే తేల్చుకోవాలని సూచించారు. 

ఈ కేసులో దోషులు బిజెపి ప్రతినిధులే కనుక సీబీఐ దర్యాప్తు చేసినా మాకేమీ భయం లేదని నలుగురు బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు చెప్పినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని తన చేతిలో నుంచి జారిపోకుండా కాపాడుకోవాలని ఎందుకు ఇంత తాపత్రయపడుతోంది?అని ప్రశ్నించుకొంటే, ఈ కేసుని బిజెపిపై ప్రయోగించేందుకు ఉపయోగపడే ఓ రాజకీయ అస్త్రంగా భావిస్తున్నందునే అని అర్దం అవుతుంది. కనుక కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని తన చేతిలోకి తీసుకొని కేసీఆర్‌ మీదకి ప్రయోగించాలని ప్రయత్నిస్తోంది.   



Related Post