ఓ వ్యక్తి కానిస్టేబుల్ స్థాయి నుంచి నగర్ కమీషనర్ స్థాయికి ఎదగడమంటే సామాన్యమైన విషయం కాదు. ఎంతో శ్రమ, పట్టుదల, తెలివితేటలు, అన్నిటికీ మించి చాలా అదృష్టం ఉండాలి. ఆ విదంగా ఎదిగిన వ్యక్తే మంచిర్యాల మున్సిపల్ కమీషనర్ నల్లమల్ల బాలకృష్ణ.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవపురానికి చెందిన బాలకృష్ణ మొదట కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత పట్టుదలగా కృషి చేసి గ్రూప్-2 పరీక్షలలో అర్హత సాధించి, 2020లో మున్సిపల్ కమీషనర్ పదవి చేపట్టారు. కనుక అటువంటి వ్యక్తి ఎందరికో స్పూర్తిదాయకం అని భావించడం సహజం. అయితే ఆయన భార్య జ్యోతిని కట్నకానుకల కోసం వేదిస్తూ చివరికి ఆత్మహత్య చేసుకొనేలా చేశారు!
ఆయన కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నప్పుడు 2014లో కొణిజర్ల మండలం సీతారామపురంకి చెందిన జ్యోతిని వివాహం చేసుకొన్నారు. వారికి రిత్విక్ (8), భవిష్య (6) అనే ఇద్దరు పిల్లలు కలిగారు. చక్కగా సాగిపోతున్న వారి సంసారంలో మున్సిపల్ కమీషనర్ పదవి చిచ్చు రగిలించింది.
బాలకృష్ణకి ఆ పదవి లభించినప్పటి నుంచి ఆయన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని జ్యోతి తల్లితండ్రులు గంగవరపు రవీంద్రకుమారి, రాంబాబులు తెలిపారు. తన ఉద్యోగం, హోదా, సంపాదన చూసి ఇంకా అందమైన అమ్మాయి, భారీ కట్నం లభించి ఉండేదని కానీ నేరకపోయి తమ కూతురుని పెళ్ళి చేసుకొన్నానని ప్రతీరోజూ మానసికంగా వేదించేవాడని వారు పోలీసులకి తెలిపారు. ఇంట్లో రోజూ తమ కూతురుని వేదిస్తూ బయట మాత్రం చాలా పెద్దమనిషిలా వ్యవహరిస్తుండేవాడని వారు ఆరోపించారు. తమ కుమార్తె మంగళవారం ఉదయం చనిపోయే గంట ముందు తమకి ఫోన్ చేసి తన భర్త తనని చంపేస్తాడేమో అని భయపడుతూ చెప్పిందని వారు పోలీసులకి తెలిపారు. కనుక తమ కుమార్తె జ్యోతిని అల్లుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడేమో అని వారు అనుమానం వ్యక్తం చేశారు.
మంచిర్యాల సిఐ నారాయణ నాయక్ సూచన మేరకు జ్యోతి తల్లితండ్రులు తమ కూతురు చావుకి అల్లుడు బాలకృష్ణ కారకుడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలకృష్ణ మున్సిపల్ కమీషనర్ కావడంతో ఆయనని అదుపులో తీసుకొనేందుకు న్యాయస్థానం అనుమతి పొందాల్సి ఉంటుంది. కనుక నేడు అనుమతి తీసుకొని అరెస్ట్ చేయవచ్చు.
బాలకృష్ణ ఎంతో కష్టపడి తన జీవితాన్ని తీర్చిదిద్దుకొన్నారు కానీ ఆయనే స్వయంగా తన జీవితాన్ని, తన భార్య, పిల్లల జీవితాలని కూడా చేజేతులా నాశనం చేసుకొన్నారు! తల్లి ఆత్మహత్య చేసుకోవడం, తండ్రి జైలుకి వెళ్లబోతుండటంతో వారి ఇద్దరి పిల్లల తల్లితండ్రులు లేనివారయ్యారు. వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారిపోయింది. ఒక పచ్చటి సంసారం ఈవిదంగా విచ్ఛిన్నం కావడం ఎంత దురదృష్టం!