ఈసారి రాష్ట్ర బడ్జెట్‌లో మెట్రోకి రూ.2,500 కోట్లు కేటాయించడంతో అటు రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు, ఇటు ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో కారిడార్స్ పొడిగింపుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. రెండు నెలల క్రితమే రాయదుర్గం-శంషాబాద్ మెట్రో పనులకి సిఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు దీని కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది కనుక త్వరలోనే పనులు ప్రారంభించవచ్చు. ఇప్పుడు పనులు మొదలుపెడితే మరో రెండేళ్లలోగా శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీ ఏర్పడుతుంది.
ఇక ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిమీ మేర మెట్రో లైన్ పొడిగింపుకి నిధులు విడుదలైనప్పటికీ, నేటికీ అలైన్‌మెంట్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ శాసనసభలో మెట్రో గురించి నిలదీస్తుంటారు కానీ మెట్రో నిర్మాణపనులు ముందుకు సాగేందుకు తోడ్పడరు. ఆ ప్రాంతంలో మెట్రో పొడిగింపుకి ఇదే పెద్ద అవరోధంగా నిలుస్తోంది. అందుకే గత బడ్జెట్‌లో కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించినా నేటికీ ఇక్కడ పనులు ప్రారంభం కాలేదు. మరో విషయం ఏమిటంటే ఇక్కడ మెట్రో పనులకి సుమారు రూ.2,000 కోట్లు అవసరం ఉంటుంది. కనుక బడ్జెట్‌లో కేటాయించిన రూ.500 కోట్లు నిర్వాసితుల నష్టపరిహారాలకే సరిపోతుందేమో?