పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు ములుగు జిల్లా మేడారంలో సమక్కసారలమ్మలని దర్శించుకొని హాత్ సే హాత్ జోడో అభియాన్ (చేతితో చేతిని కలుపుతూ) పాదయాత్ర ప్రారంభించారు. నేటి నుంచి ఈ నెల 22వరకు మహబూబాబాద్ లోని ఏడు శాసనసభ నియోజకవర్గాల గుండా పాదయాత్ర చేయబోతున్నారు. ఆ తర్వాత ఛత్తీస్‌ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు జరుగబోయే ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలకి హాజరయ్యేందుకు పాదయాత్రకి బ్రేక్ ఇస్తారు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత రెండు నెలలపాటు పాదయాత్ర చేస్తారు.
తొలి విడత పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు తమ తమ నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డితో కలిసి పాదయాత్రలో పాల్గొంటారు. రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్రంలో ఇతర కాంగ్రెస్ నేతలు కూడా తమ తమ నియోజకవర్గాలలో పాదయాత్రలు చేయబోతున్నారు.
ఓ పార్టీ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాలంటే అనేకానేక సానుకూల అంశాలు ఉండాలి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అటువంటి ఒక్క సానుకూల అంశం ఏదైనా ఉందా?అని ప్రశ్నించుకొంటే లేదనే చెప్పాలి. వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్, బిజెపిల మద్య భీకరపోరు జరుగబోతోంది. కనుక కాంగ్రెస్‌కి అవకాశాలు ఇంకా తక్కువగా ఉంటాయి. అయితే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని అధికారంలోకి వచ్చేందుకు పాదయాత్ర తోడ్పడుతుందని భావిస్తున్నట్లున్నారు. కానీ ముందు ఇంటిని చక్కబెట్టుకోకుండా పాదయాత్ర చేసి ఏం ప్రయోజనం?