బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తుని సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుని హైకోర్టు ధర్మాసనం కూడా సమర్ధించడం తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఆ కేసు విచారణ పేరుతో బిజెపి జాతీయ స్థాయి నేతలకి సైతం నోటీసులు పంపించి ముప్పతిప్పలు పెట్టగలిగింది. కానీ ఇప్పుడు ఆ కేసు ‘సిట్’ చేతిలో నుంచి సీబీఐకి బదిలీ అవడంతో ఇప్పుడు శక్తివంతమైన ఈ అస్త్రం కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వచ్చిన్నట్లయింది.
దీంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సీబీఐ ద్వారా ఆ నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలని వారితో పాటు తెలంగాణ ప్రభుత్వంలోని పలువురిని విచారణ పేరుతో ఇబ్బందిపెట్టగలదు. కనుక ఊహించిన్నట్లే ఆ నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని నిర్ణయించుకొన్నారు.
హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత బిఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మేము హైకోర్టు తీర్పుని గౌరవిస్తాము. కానీ సీబీఐ, ఈడీలని కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థలుగా వాడుకొంటున్నందున, సీబీఐ చేతిలో ఈ కేసు నిష్పక్షపాతంగా విచారణ జరగదని మేము భావిస్తున్నాము. సీబీఐ విచారణ పేరుతో మమ్మల్ని ఇబ్బందిపెట్టేందుకు ప్రయత్నించవచ్చు కనుక హైకోర్టు తీర్పుని మేము సుప్రీంకోర్టులో సవాలు చేయబోతున్నాము,” అని చెప్పారు.
అయితే ఈ కేసు దర్యాప్తుని ‘సిట్’ చేతిలో నుంచి సీబీఐ చేతిలోకి వెళ్ళిపోవడానికి స్వయంకృతమే అని అందరికీ తెలుసు. ఈ కేసుని తెలంగాణ ప్రభుత్వం రాజకీయాస్త్రంగా బిజెపిపై సందించింది. కనుక బిజెపి కూడా ఎత్తుకు పైఎత్తు వేసి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలని గాలం వేసి పట్టుకొందని భావించవచ్చు.