పాక్ ప్రభుత్వానికి ఎన్ని కష్టాలో?

October 22, 2016


img

యూరి దాడుల తరువాత నుంచి పాక్ ప్రభుత్వ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. భారత్ ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించి ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షిస్తే, అటువంటిదేమీ జరుగలేదని చెప్పుకొంటూ పాక్ నవ్వులపాలవుతోంది. కాశ్మీర్ అంశం ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించబోతే ప్రపంచదేశాలు పట్టించుకోక పోవడంతో అంతర్జాతీయంగా పాక్ ఒంటరి అయ్యింది. అందుకు పాక్ పార్లమెంటులో ప్రతిపక్షాల చేత ప్రధాని నవాజ్ షరీఫ్ క్లాసు పీకించుకోవలసి వచ్చింది. ఆ కోపాన్ని ఆయన ఆర్మీ అధికారుల మీద ప్రదర్శించబోతే వారు తిరిగి ఆయనపైనే చిర్రుబుర్రులాడినట్లు డాన్ పత్రిక బయటపెట్టడంతో పాక్ ఆర్మీకి, ప్రభుత్వానికి మద్య విభేదాలు తలెత్తాయని, ఆర్మీ తిరుగుబాటు తప్పదని పుకార్లు వ్యాపించాయి. అవి చూసి పాక్ ఆర్మీ కన్నెర చేస్తే, ఆ వార్త వ్రాసిన జర్నలిస్టుని విదేశాలకి పారిపోకుండా ఆంక్షలు విదించింది. కానీ మీడియా కట్టకట్టుకొని విమర్శలు గుప్పించడంతో ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవలసివచ్చింది.

మధ్యలో ఎంట్రీ ఇచ్చిన మాజీ క్రికెటర్, మరియు ప్రధాన ప్రతిపక్ష పార్టీ పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ తాను నవాజ్ షరీఫ్ ని అసలు ప్రధానిగా గుర్తించడం లేదని, కనుక ఆయన నిర్వహించే పార్లమెంటు సమావేశాలకి హాజరుకానని ప్రకటించడమే కాకుండా అన్నంతపనీ చేశారు. పనామా కుంభకోణంలో నవాజ్ షరీఫ్ పేరున్న నవాజ్ షరీఫ్ కనీసం భారత్ కి ధీటుగా జవాబు చెప్పలేని అసమర్దుడుగా మిగిలిపోయాడని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. ఆయన ఆరోపణలని బలపరుస్తున్నట్లు పాక్ సుప్రీంకోర్టు నవాజ్ షరీఫ్ కి పనామా కుంభకోణం కేసులో నోటీసు పంపినట్లు సమాచారం. ఇమ్రాన్ ఖాన్ నవంబర్ 2న ‘ఛలో ఇస్లామాబాద్’ కి పిలుపునిచ్చారు. ఆరోజు వేలాదిమంది ప్రజలతో కలిసి ఇస్లామాబాద్ ని దిగ్బంధం చేస్తామని ప్రకటించారు.

ఆయనకి రెండు ఉగ్రవాద సంస్థలు కూడా మద్దతు పలుకడంతో పాక్ ప్రభుత్వంలో కంగారు మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో పాక్ సైన్యాధ్యక్షుడు జనరల్ రహీల్ షరీఫ్ పదవీ విరమణ చేయబోతున్నారు. కనుక ఆ స్థానం కోసం సైన్యంలో కొంతమంది సీనియర్ అధికారులు నవాజ్ షరీఫ్ పై ఒత్తిడి చేస్తుండటం సహజమే. ఇక భారత్-పాక్ సరిహద్దుల వద్ద కాల్పుల ఉల్లంఘనకి పాల్పడుతున్న పాక్ సైనికులకి భారత్ సైనికులు చాల ధీటుగా బదులిస్తుండటంతో, రెండు రోజులలోనే ఏడుగురు పాక్ సైనికులు చనిపోయారు. ఆ కారణంగా కూడా పాక్ ప్రభుత్వం ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా నుంచి విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఇవన్నీ పాక్ ప్రభుత్వం స్వయంకృతాపరాధాలే. కనుక ఎవరినీ నిందించడానికి కూడా లేదు.


Related Post