బయట పులిలా గర్జించి లోపల మ్యావ్ మన్నారు

February 03, 2023


img

సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శాసనసభలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగంపై కాస్త అనుచిత వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బయట పులిలా గర్జించారు. కానీ నేడు శాసనసభలో ఆమె ప్రసంగం పిల్లి మ్యావ్ మ్యావ్ మన్నట్లుంది. కేసీఆర్‌ ఏం మాట్లాడమన్నారో ఆమె అదే మాట్లాడారు తప్ప ఒక్క సమస్యని కూడా తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. ఆమెకి, కేసీఆర్‌కి రాజీ కుదరడంతో గత్యంతరంలేకనే ఆమె ఆయనని పొగుడుతూ ప్రసంగించాల్సి వచ్చిందని భావిస్తున్నాను. దీంతో బిఆర్ఎస్‌, బిజెపిల మద్య అవగాహన కుదిరిందని మరోసారి స్పష్టం అయ్యింది. ఆమె బిఆర్ఎస్‌, బిజెపిల మద్యవర్తిగా మారిన్నట్లున్నారు. 

ఆమె ఏ కారణం చేత రాష్ట్ర సమస్యల గురించి శాసనసభలో మాట్లాడకపోయినా మేము తప్పకుండా బడ్జెట్‌ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాము. ముఖ్యంగా అంగన్వాడీ, వీఆర్‌వో, ఐకేపీ ఉద్యోగులు, సర్పంచ్‌ల సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాము, రాష్ట్రంలో పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ళు కట్టించి ఇస్తామని చెప్పిన కేసీఆర్‌, కనీసం స్థలాలు కూడా ఇవ్వలేదు. పేదలకి ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు ఉన్న జీవోని కూడా రద్దు చేశారు. రాష్ట్రంలో ఇంకా అనేక సమస్యలున్నాయి. శాసనసభలో మా మైకులు కట్ చేయకుండా మాకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తే అన్నిటిపై ప్రభుత్వాన్ని నిలదీస్తాము,” అని అన్నారు. 

శాసనసభ, మండలిలో ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు ఆమె ప్రజలు ఎన్నుకొన్న ప్రజాప్రతినిధి కారు. రాజ్యాంగబద్దంగ బద్దమైన గవర్నర్‌ పదవిలో ఉన్నారు. కనుక రాజ్యాంగం ప్రకారం ఆమె ఏమి చేయాలో అది మాత్రమే చేశారు. కనుక ఈ విషయంలో ఆమెని ఎవరూ తప్పు పట్టడానికి లేదు. ఒకవేళ సమస్యల గురించి మాట్లాడాలనుకొంటే, అధికారులని రాజ్‌భవన్‌కి పిలిపించుకొని ఆమె నిలదీయవచ్చు. ఆ పని ఆమె ఎప్పటి నుంచో చేస్తున్నారు. కనుకనే కేసీఆర్‌ ప్రభుత్వం ఆమెపై తీవ్ర ఆగ్రహంగా ఉందని జగ్గారెడ్డికి కూడా తెలుసు కదా? 


Related Post