‘ఏ దిల్ హై ముష్కిల్’ రిలీజ్ బహుత్ ముష్కిల్ సే

October 22, 2016


img

మన దేశంలో సినీ పరిశ్రమ పరిస్థితిని ఆకు-ముల్లుతో పోల్చవచ్చు. అది ఏ విషయంలోనైనా కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించినా లేదా దేశంలో ఎవరికైనా కొంచెం అత్యుత్సాహం కలిగినా నష్టపోయేది సినీ పరిశ్రమే.’ 

కరణ్ జోహార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ హిందీ సినిమా అందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  కాశ్మీర్ లో యూరీ దాడులు జరిగితే మహారాష్ట్రాలో ఆ సినిమా రిలీజ్ ఆగిపోయింది. కారణం అందులో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ కూడా నటించడమే. 

హిందీ సినిమాలలో నటిస్తున్న పాక్ కళాకారులందరినీ దేశం విడిచివెళ్ళిపోవాలని, పాక్ నటీనటులున్న ఏ సినిమాని విడుదల చేయడానికి, ప్రదర్శించడానికి వీలులేదని మహారాష్ట్ర నవ్ నిర్మాణ సేన హుకూం జారీ చేసింది. దానితో దీపావళికి రిలీజ్ కావలసిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమాకి కష్టాలు మొదలయ్యాయి. దర్శక నిర్మాత కరణ్ జోహార్ డిల్లీ నుంచి గల్లీ వరకు అందరి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలాడు. కానీ ఫలితం లేదు. చివరికి బాలీవుడ్ నిర్మాతల సంఘం అధ్యక్షుడు ముఖేష్ బట్ ని వెంటబెట్టుకొని మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఆ పార్టీ అధినేత రాజ్ థాక్రేతో మాట్లాడారు. 

థాక్రే వారికి మూడు షరతులు పెట్టారు. ఆ సినిమా ప్రారంభంలో ఉగ్రవాదుల దాడులలో చనిపోయిన జవాన్ల మృతికి శ్రద్దాంజలి ఘటిస్తూ ఒక ప్రకటన పెట్టాలి. ఇకపై హిందీ సినిమాలలో పాక్ కళాకారులని తీసుకోకూడదు. పాక్ నటులతో సినిమాలు తీసిన నిర్మాతలు అందరూ ఒక్కొక్కరూ రూ.5 కోట్లు ఆర్మీ వెల్ ఫేర్ ఫండ్ కి విరాళంగా అందిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వలి. 

సినిమా విడుదల కావాలంటే వాటిని అంగీకరించడం తప్ప వేరే మార్గం లేదు కనుక వాటిని అంగీకరించారు. కనుక సినిమా రిలీజ్ కి సహకరిస్తామని థాక్రే ప్రకటించడంతో ఏ దిల్ హై ముష్కిల్ సినిమా దీపావళికి రిలీజ్ కాగలుగుతోంది. 

నిజజీవితంలో ‘సినిమా కష్టాలు’ అనే మాట అప్పుడప్పుడు వింటుంటాము. కానీ సినీ పరిశ్రమకి కూడా ఆ సినిమా కష్టాలు తప్పడం లేదు. 

మహారాష్ట్రాలో భాజపా-శివసేన సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. కేంద్రంలో భాజపా అధికారంలో ఉంది. ఒక సినిమా విడుదల చేయవచ్చా లేదా అనే దానిని నిర్ణయించడానికి రాష్ట్రంలో సెన్సార్ బోర్డు ఉంది. ఒకవేళ వాళ్ళెవరూ న్యాయం చేయకపోతే వారి తప్పులని సరిదిద్దడానికి న్యాయవ్యవస్థ ఉంది. కానీ వాటన్నిటికీ అతీతంగా రాజ్ థాక్రే ఉన్నాడు. అయన అంగీకరిస్తే తప్ప రాష్ట్రంలో సినిమా విడుదల అవదు. విడుదలయినా నడవలేదు. అంటే రాష్ట్రంలో ఆయన సమాంతర ప్రభుత్వం నడిపిస్తున్నట్లు చెప్పవచ్చు. 

కరణ్ జోహార్ మొదట నేరుగా కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలిశారు కానీ ఆయన కూడా చేతులెత్తేశారు. బహుశః ఆయన సూచన మేరకే ముఖ్యమంత్రి థాక్రేతో ఈ సమావేశం ఏర్పాటు చేసి ఉండవచ్చు. కానీ సాక్షాత్ ముఖ్యమంత్రి సమక్షంలోనే సినీ నిర్మాతలకి ఇటువంటి షరతులు విధించగలిగారు. అతనిని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కానీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ గానీ ఏమీ చేయలేకపోయారు. అంటే ఆయన వారిద్దరికంటే ఎంత శక్తివంతుడో అర్ధం అవుతోంది.    

హిందీ సినిమాలలో చాలా ఏళ్ళుగా పాక్ నటీనటులు నటిస్తున్నారు. కనుక ఈ సినిమాలో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించడమేమి కొత్త విషయం కాదు. అది నేరం కూడా కాదు. పాక్ వైఖరికి నిరసనగా పాక్ కళాకారులని వద్దనుకొంటే, ఇక ముందు సినిమాలలో తీసుకోవద్దని కోరడం తప్పు కాదు. కానీ రిలీజ్ కి సిద్దంగా ఉన్న సినిమాని అడ్డుకోవడమే చాలా తప్పు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉండగా సమాంతర ప్రభుత్వం నడపడం ఇంకా తప్పు. ఆవిధంగా నడిపిస్తున్నవారిని ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోవడం తప్పు. వ్యవస్థలో ఈ లోపాలకి సినీ పరిశ్రమ మూల్యం చెల్లించవలసి వస్తోంది.


Related Post