మనకి రాజకీయాలు ఎక్కువ... అభివృద్ధి ఆలోచనలు తక్కువ: కేటీఆర్‌

February 02, 2023


img

తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ నేషనల్ హ్యూమన్ రీసౌర్స్ డెవలప్‌మెంట్‌ ఆధ్వర్యంలో ‘డీ కోడ్ ది ఫ్యూచర్’ పేరిట హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, “మన దేశంలో మేధావులకి, నిపుణులకి కరువు లేదు. సహజవనరులకి, మానవవనరులకి కరువు లేదు. అయినా దేశం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందడం లేదు. ఎందుకంటే మన దేశంలో అందరూ ముఖ్యంగా పాలకులు ఎన్నికలు, రాజకీయాలపైనే ఎక్కువ శ్రద్ద చూపుతారు తప్ప అభివృద్ధిని పట్టించుకోరు. మన దేశంలో ఏడాది పొడవునా ఏదో ఓ రాష్ట్రంలో ఏవో ఓ ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. కనుక ఎల్లప్పుడూ రాజకీయ వాతావరణమే నెలకొని ఉంటుంది. 

మన కంటే చిన్న దేశాలైన జపాన్, సింగపూర్ కూడా ఆర్ధికంగా ఎంతో బలంగా ఉంటాయి. అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తున్నాయి. మనదేశంలో 60% యువత ఉంది. అభివృద్ధికి అవసరమైన అన్ని వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ అభివృద్ధి చెందలేకపోతున్నాము. కానీ తెలంగాణలో అభివృద్ధికి దోహదపడే విధానాలని అమలుచేస్తుండటం వలన కేవలం 8 ఏళ్ళలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించగలిగాము. 

కేవలం 15 రోజులలో పరిశ్రమలకి అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నాము. అందుకే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి అనేక అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌కి తరలివచ్చి కార్యాలయాలు ఏర్పాటు చేసుకొన్నాయి. ప్రపంచలోకెల్లా అతిపెద్ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని కేవలం నాలుగేళ్ళలోనే నిర్మించడంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం కూడా ఎంతో అభివృద్ధి సాధిస్తోంది. 

కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దేశాభివృద్ధికి పెద్దగా ఉపయోగపడేలా లేదు. చైనా, జపాన్ దేశాల మాదిరిగా కేంద్ర ప్రభుత్వం కూడా రాజకీయాలని పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెడితే భారత్‌ కూడా అగ్రదేశాలతో పోటీ పడేస్థాయికి ఎదగడం పెద్ద కష్టం కాదు,” అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 

మన భారతీయులు విదేశాలలో అత్యున్నత స్థాయిలో నిలుస్తూ రాణిస్తున్నారు. అలాగే మన దేశంలో ఉన్న ఈ మేధోశక్తిని, వ్యాపార అవకాశాలని ప్రపంచదేశాలన్నీ బాగానే గుర్తించాయి కనుకనే భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. మన వద్ద ప్రతిభ, అవకాశాలు, సహజవనరులు అన్నీ పుష్కలంగా ఉన్నప్పటికీ ఎందుకు అభివృద్ధి చెందలేకపోతోంది? నేటికీ చైనా ఉత్పత్తుల మీదనే దేశప్రజలు ఎందుకు ఆధారపడవలసి వస్తోంది?’మేడ్ ఇన్‌ ఇండియా’ బ్రాండ్‌తో ఉత్పత్తులు ప్రపంచానికి ఎందుకు అందించలేకపోతున్నాము?యువత కూడా ఉద్యోగాలు కల్పించే స్థాయికి తాము ఎదగాలని ఆలోచించకుండా ఉద్యోగాల కోసం ఎందుకు ఎదురుచూస్తోంది?అనే కేటీఆర్‌ ప్రశ్నలు ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి. కానీ వాటికి సమాధానం కూడా ఆయనే చెప్పారు. పాలకులు అభివృద్ధి కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం వలననే ఈవిదంగా వెనకబడిపోయామన్న కేటీఆర్‌ వాదన 100% నిజం.


Related Post