బడ్జెట్‌లో తెలంగాణకి మళ్ళీ అన్యాయమే: మంత్రి హరీష్‌

February 02, 2023


img

కేంద్ర ప్రభుత్వం ఈసారి కూడా బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో అందమైన మాటలు, అంకెల గారడీ తప్ప  రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడేది ఏమీ లేదన్నారు. తెలంగాణకి కోచ్ ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా బడ్జెట్‌లో ప్రస్తావించనేలేదని, రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలకి ఈయవలసిన రూ.1,350 కోట్లు ఇవ్వలేదని, కానీ ఎన్నికలు జరుగబోతున్న కారణంగా కర్ణాటక రాష్ట్రానికి ఏకంగా రూ.5,300 కోట్లు కేటాయించిందని మంత్రి హరీష్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దేశవ్యాప్తంగా 157 నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నా వాటిలో ఒక్కటి కూడా తెలంగాణకి కేటాయించలేదన్నారు. ఈ బడ్జెట్‌లో కూడా విభజన హామీల ప్రస్తావన లేదన్నారు. తెలంగాణ నేతన్నలపై జీఎస్టీ విధించడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామని, కనీసం వారికి జీఎస్టీ రాయితీలు, ప్రోత్సాహకాలైనా బడ్జెట్‌లో ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15వ ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు రాష్ట్రాలకి పన్ను వాటాలో 41% ఈయవలసి ఉండగా 30.4% మాత్రమే ఇవ్వడాన్ని మంత్రి హరీష్‌ రావు తప్పు పట్టారు.  

ఉపాధి హామీ పధకానికి రూ.29,400 కోట్లు కోత పెట్టి నిరుపేదలకి ఉపాధి లేకుండా చేస్తోందన్నారు. అలాగే ఆహార భద్రత పధకానికి 31% కోత పెట్టి నిరుపేదల కడుపు కొడుతోందని మంత్రి హరీష్‌ రావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రైతులు, నిరుపేదలకి తీరని అన్యాయం చేసిందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. రాష్ట్రాలని ఆర్ధిక క్రమశిక్షణ పాటించాలని ఒత్తిడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, తాను మాత్రం పాటించకుండా దేశాన్ని అప్పుల ఊబిలో  కూరుకుపోయేలా చేస్తోందని మంత్రి హరీష్‌ రావు ఆరోపించారు. 


Related Post