రాష్ట్రపతి అంటే మాకు గౌరవమే కానీ... బిఆర్ఎస్‌

February 01, 2023


img

బిఆర్ఎస్‌ పార్టీ తీరు రాన్ర్రాను వివాదాస్పదంగా మారుతోంది. రాష్ట్రంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో అనుచితంగా వ్యవహరిస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ మొండిగా ముందుకు సాగి బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ కొరకు చివరికి గవర్నర్‌ వద్ద తల దించుకోక తప్పలేదు. 

ఇదివరకు వివిద అంశాలలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నప్పుడు, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య సంబంధాలు వేరు, టిఆర్ఎస్‌-బిజెపిల మద్య రాజకీయ వైరం వేరని సిఎం కేసీఆర్‌ గట్టిగా సమర్ధించుకొనేవారు. కానీ ఇప్పుడు ఆయనే ఆ సన్నటి గీతని చెరిపేసి, కేంద్ర ప్రభుత్వాన్ని బిజెపి ప్రభుత్వంగా పరిగణిస్తూ, తాను బిఆర్ఎస్‌ ప్రభుత్వాధినేతగా వ్యవహరిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.    

ప్రధాని నరేంద్రమోడీ, ఆయన ప్రభుత్వంపై సిఎం కేసీఆర్‌ కత్తులు దూస్తున్నారు కనుక నిన్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగాన్ని బిఆర్ఎస్‌ ఎంపీలు బహిష్కరించడం చాలా శోచనీయం. రాష్ట్రంలో గవర్నర్‌పై కత్తులు దూస్తున్నారు సరే! రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఏం పాపం చేశారు?

ఒకవేళ బిఆర్ఎస్‌ ఎంపీలు కేంద్ర ప్రభుత్వ విధానాలని, నిర్ణయాలని వ్యతిరేకించదలిస్తే పార్లమెంటు సమావేశాలలో గట్టిగా నిలదీయవచ్చు కదా?కానీ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం దేనికి?రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు తెస్తానని చెపుతున్న కేసీఆర్‌, ఈవిదంగా మూస రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు?ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే సిఎం కేసీఆర్‌ మొహం చాటేస్తుంటారు. రాష్ట్రంలో మహిళా గవర్నర్‌ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుచితంగా వ్యవహరిస్తుంటుంది. ఇప్పుడు మహిళా రాష్ట్రపతి పట్ల ఇలా అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. బిఆర్ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవ రెడ్డి బయట మీడియాతో మాట్లాడుతూ, “మేము కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలని ఎండగట్టేందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాము తప్ప ఆమెని వ్యతిరేకించి కాదు. ప్రజాస్వామ్యబద్దంగా మేము నిరసన తెలిపాము అంతే!” అని అన్నారు. 

బిఆర్ఎస్‌ పార్టీ తన చర్యలను ఎంతగా సమర్ధించుకొంటున్నప్పటికీ, గవర్నర్‌, రాష్ట్రపతి, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వంతో కేసీఆర్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల తెలంగాణ ప్రజలు సైతం అసంతృప్తిగానే ఉన్నారనే విషయం పట్టించుకొంటున్నట్లు లేదు. కేంద్ర ప్రభుత్వం విధానాలని తప్పు పడుతున్న కేసీఆర్‌, తమ ఈ వైఖరిని తెలంగాణ ప్రజలు హర్షిస్తారా? అని ఆలోచించుకొంటే మంచిదేమో?


Related Post