గవర్నర్‌-ప్రభుత్వం మద్య సయోధ్య తాత్కాలికమేనా?

January 31, 2023


img

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌-రాష్ట్ర ప్రభుత్వం మద్య జరుగుతున్న యుద్ధం నిన్న హైకోర్టుకి చేరడంతో పతాకస్థాయికి చేరుకొంది. కానీ హైకోర్టు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో గవర్నర్‌ కూడా వెనక్కి తగ్గారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిన్న రాజ్‌భవన్‌ వెళ్ళి ఆమెని బడ్జెట్‌ ఆమోదించవలసిందిగా కోరారు. బడ్జెట్‌ సమావేశాలకి ముందు ఉభయసభలని ఉద్దేశ్యించి ప్రసంగించవలసిందిగా ఆహ్వానించారు. ఆమె కూడా బెట్టు చేయకుండా వెంటనే బడ్జెట్‌ని ఆమోదించి, బడ్జెట్‌ సమావేశాలకి అనుమతించారు. అలాగే తన వద్ద పెండింగులో ఉన్న 8 బిల్లులపై సంబదిత శాఖల కార్యదర్శులు గవర్నర్‌ని కలిసి వివరణ ఇచ్చిన తర్వాత వాటికీ ఆమె ఆమోద ముద్రవేసేందుకు అంగీకరించారు.

కనుక ప్రస్తుతానికి గవర్నర్‌-రాష్ట్ర ప్రభుత్వానికి మద్య రాజీ కుదిరింది కనుక బడ్జెట్‌ సమావేశాలు నిరాటంకంగా సాగుతాయి. అంతా సవ్యంగా సాగితే ఆ తర్వాత ఆమె బడ్జెట్‌కి కూడా ఆమోదం తెలుపుతారు. అయితే ఆ తర్వాతే అసలు కధ మొదలవవచ్చు. ఇంతకాలం గవర్నర్‌ని ధిక్కరిస్తున్న సిఎం కేసీఆర్‌కి బడ్జెట్‌ కోసం ఆమె ముందు తలవంచుకోవలసి రావడం చాలా అవమానకరమే. దీంతో ఆయన అహం మరింత దెబ్బ తినడం సహజమే. కనుక గవర్నర్‌ బడ్జెట్‌కి ఆమోదముద్ర వేసిన మరుక్షణం ఆమెపై మళ్ళీ కేసీఆర్‌తో సహా మంత్రులందరూ మూకుమ్మడిగా ఎదురుదాడి చేసినా ఆశ్చర్యం లేదు.

ఎందుకంటే వారి ప్రభుత్వానికి ఇదే ఆఖరి బడ్జెట్‌. ఈ డిసెంబర్‌లోగా శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. గవర్నర్‌తో ఇబ్బందులని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. కనుక గవర్నర్‌-రాష్ట్ర ప్రభుత్వం మద్య ఏర్పడిన ఈ సయోధ్య తాత్కాలికమే అని భావించవచ్చు.


Related Post