తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు వాయిదా?

January 31, 2023


img

ఫిభ్రవరి 3వ తేదీ నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉండగా అవిప్పుడు వాయిదా వేయక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో రాష్ట్ర ప్రభుత్వం రాజీపడి ఆనవాయితీ ప్రకారం ఆమెని బడ్జెట్‌ సమావేశాలకి ముందు ఉభయసభలని ఉద్దేశ్యించి ప్రసంగించేందుకు ఆహ్వానించినప్పటికీ, సాంకేతిక కారణాల వలన అదేరోజున బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. 

సాధారణంగా శాసనసభ సమావేశాలు నిర్వహించిన తర్వాత అక్కడితో ఆ సమావేశాలు ‘ప్రోరోగ్’ (సమావేశాలు ముగిసిన్నట్లు) ప్రకటింస్తుండటం ఆనవాయితీ. తదుపరి సమావేశాలకి మళ్ళీ గవర్నర్‌ ఆమోదంతో నోటిఫికేషన్‌ జారీ చేసి నిర్వహిస్తుంటారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్‌కి మద్య విభేధాలు ఏర్పడటంతో సమావేశాలని ‘ప్రోరోగ్’ చేస్తే, ప్రతీసారి ఆమె అనుమతి పొందవలసి వస్తుందనే ఉద్దేశ్యంతో ప్రోరోగ్ చేయకుండా, గవర్నర్‌ ప్రమేయం లేకుండానే వాటికి కొనసాగింపుగా సమావేశాలని ప్రభుత్వం నిర్వహిస్తోంది. 

గత బడ్జెట్‌ సమావేశాలని కూడా అదేవిదంగా నిర్వహించింది. అయితే అప్పుడు గవర్నర్‌ బడ్జెట్‌ ముసాయిదాకి ఆమోదం తెలుపడంతో ఆమెని ఆహ్వానించకుండానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించగలిగింది. కానీ ఈసారి ఆమె ఆమోదం తెలుపకపోవడంతో సమావేశాలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. 

రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కి వ్యతిరేకంగా హైకోర్టుకి వెళ్ళినప్పటికీ మళ్ళీ వెనక్కి తగ్గి ఆమెతో రాజీ పడటంతో ఆమె కూడా బడ్జెట్‌కి ఆమోదం తెలిపారు. కానీ గత సమావేశాలని ప్రోరోగ్ చేయనందున, ముందుగా దాని కోసం నోటిఫికేషన్‌ జారీ చేయాలి. దానిని గవర్నర్‌ ఆమోదించాలి. ఆ తర్వాత మళ్ళీ బడ్జెట్‌ సమావేశాలకి గవర్నర్‌ అనుమతి తీసుకొని నోటిఫికేషన్‌ జారీ చేయాలి. 

ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం వారం రోజులు పట్టవచ్చు. కనుక ఫిభ్రవరి 6నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఉన్నతాధికారులు గవర్నర్‌ని కలిసి మాట్లాడారు. అనంతరం సిఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమావేశమయ్యి బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ గురించి చర్చించారు. బహుశః నేడో రేపో దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 


Related Post