తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విషయంలో ఎట్టకేలకి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆనవాయితీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆమెని బడ్జెట్ సమావేశాలకు ముందు ఉభయసభలని ఉద్దేశ్యించి ప్రసంగించేందుకు ఆహ్వానించవలసి ఉంటుంది. కానీ ఆహ్వానించకూడదనుకొంది. కనుక ఆమె కూడా తన అధికారాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అర్ధమయ్యేలా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ముసాయిదా బడ్జెట్‌ని ఆమోదించకుండా పక్కనపెట్టేశారు.
దాంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుని ఆశ్రయించింది. ఆమెని ముసాయిదా బడ్జెట్ ఆమోదించవలసిందిగా ఆదేశించాలని హైకోర్టుని కోరింది. అయితే గవర్నర్ నిర్ణయాధికారాలపై హైకోర్టు న్యాయసమీక్ష చేయవచ్చో లేదో ప్రభుత్వమే ఆలోచించుకొంటే మంచిదని చెపుతూ ఈ కేసు విచారణని ఈరోజు మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
హైకోర్టు చేసిన సూచనతో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయకతప్పలేదు. భోజన విరామం తర్వాత హైకోర్టు ఈ కేసు విచారణ చేపట్టినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది దుష్యంత్ దవే, ఈ కేసును ఉపసంహరించుకొంటున్నట్లు తెలియజేశారు. బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రసంగించేందుకు గవర్నర్‌ని ఆహ్వానిస్తామని కూడా తెలియజేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తెగేవరకూ తాడు లాగి ఉంటే ఏమై ఉండేదో కానీ చివరి నిమిషంలో విజ్ఞతతో వ్యవహరించి వెనక్కి తగ్గింది.