తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ అగ్నిపరీక్ష

January 30, 2023


img

తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కి మద్య జరుగుతున్న పోరాటం పతాక స్థాయికి చేరుకొంది. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బడ్జెట్ ముసాయిదా కాపీలకి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలుపలేదు! ఆమె ఆమోదం తెలిపితే కానీ దానికి మంత్రి వర్గం ఆమోదం తెలుపలేదు. ఫిబ్రవరి 3న దానిని శాసనసభ, మండలిలో  ప్రవేశపెట్టలేదు! అంతే కాదు... శాసనసభ, మండలి ఆమోదించిన ఆ బడ్జెట్ ని కూడా గవర్నర్ ఆమోదం తెలుపవలసి ఉంటుంది. సకాలంలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేకపోయినా, ఉభయసభలు ఆమోదించిన బడ్జెట్ ని ఆమోదింపజేసుకోలేకపోయినా ప్రభుత్వం రద్దు అయిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది! 

కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ వేస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బడ్జెట్ ముసాయిదాని ఆమోదించవలసిందిగా గవర్నర్‌ని ఆదేశించాలని ఆయన హైకోర్టుని కోరబోతున్నారు.  

గత ఏడాదిన్నరగా సిఎం కేసీఆర్‌, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌తో విభేదిస్తూ దూరంగా ఉంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్ మర్యాదలు పాటించకపోవడమే కాకుండా, మంత్రులు తన పట్ల చాలా అనుచిత విమర్శలు, ఆరోపణలు చేస్తున్నందుకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. 

బడ్జెట్ సమావేశాలకి ముందు ఉభయ సభల సభ్యులని ఉద్దేశ్యించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంది కనుక ప్రసంగ పాఠం పంపించాలని కోరుతూ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కొన్ని రోజుల క్రితం వ్రాసిన లేఖపై ప్రభుత్వం స్పందించలేదు. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అవుతుండటంతో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కూడా బడ్జెట్ ముసాయిదా కాపీలపై ఆమోదముద్ర వేయకుండా తాత్సారం చేస్తూ ప్రభుత్వానికి తన అధికారాలని రుచి చూపిస్తున్నరని అనుకోవచ్చు. 

అయితే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌తో మాట్లాడి సమస్యని పరిశ్కరించుకొనే ప్రయత్నం చేయకుండా హైకోర్టుని ఆశ్రయించడంతో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మద్య యుద్ధం పతాక స్థాయికి చేరుకొన్నట్లయింది. రాష్ట్ర ప్రభుత్వమే హైకోర్టుని ఆశ్రయించింది కనుక ఇప్పుడు గవర్నర్ కూడా పునరాలోచన చేయాల్సిన అవసరమే లేదు. 

ఒకవేళ ఈ వ్యవహారంలో హైకోర్టు కలుగజేసుకోదలచుకోకపోతే కేసీఆర్‌ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోక తప్పదు. ఇది స్వయంకృతమే అని చెప్పక తప్పదు. మరి ఈ వ్యవహారంపై హైకోర్టు ఏం చెపుతుందో మరికొద్ది సేపటిలో తెలుస్తుంది.     



Related Post