బిఆర్ఎస్‌కి అన్నీ మంచి శకునాలే?

January 28, 2023


img

సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో  జాతీయ రాజకీయాలలోకి ప్రవేశిస్తున్న బిఆర్ఎస్‌ పార్టీకి ఇతర రాష్ట్రాలలో విస్తరించేందుకు అనూహ్యమైన అవకాశాలు లభిస్తున్నాయి. మొదట ఏపీలో విస్తరించేందుకు ఆ రాష్ట్రానికి చెందిన తోట చంద్రశేఖర్‌ తదితరులు వచ్చి కేసీఆర్‌ని కలిసి బిఆర్ఎస్‌ పార్టీలో చేరగా, నిన్న ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్‌తో సహ పలువురు నేతలు హైదరాబాద్‌ వచ్చి తెలంగాణ భవన్‌లో సిఎం కేసీఆర్‌ సమక్షంలో బిఆర్ఎస్‌ పార్టీలో చేరారు. ఈరోజు తమిళనాడుకి చెందిన ప్రముఖ సినీ నటుడు, ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి పార్టీ అధ్యక్షుడు శరత్ కుమార్‌ హైదరాబాద్‌ వచ్చి  బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ, భారత్‌ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితని కలిశారు. వారిరువురూ జాతీయ రాజకీయాలు, బిఆర్ఎస్‌ ఆశయాలు, కార్యాచరణ గురించి మాట్లాడుకొన్నారు. అంటే శరత్ కుమార్‌ కూడా బిఆర్ఎస్‌ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్దమని చెప్పకనే చెప్పిన్నట్లు స్పష్టం అవుతోంది. కనుక తమిళనాడులో అడుగుపెట్టేందుకు బిఆర్ఎస్‌ పార్టీకి అప్పుడే ఓ మిత్రుడు లభించిన్నట్లే భావించవచ్చు. బహుశః త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్‌ వాఘేలా సుమారు రెండు నెలల క్రితమే హైదరాబాద్‌ వచ్చి కేసీఆర్‌తో భేటీ అయ్యి ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు సంసిద్దత వ్యక్తం చేశారు. కనుక గుజరాత్‌ రాష్ట్రంలో కూడా బిఆర్ఎస్‌కి బలమైన స్నేహితుడు లభించిన్నట్లే భావించవచ్చు. ఖమ్మంలో జరిగిన తొలి బిఆర్ఎస్‌ సభలో పాల్గొని ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు కేసీఆర్‌తో కలిసి పనిచేసేందుకు సంసిద్దత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఫిభ్రవరి 17వ తేదీన కేసీఆర్‌ పుట్టినరోజునాడు కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆ కార్యక్రమానికి వివిద రాష్ట్రాల నేతలు, ముక్యమంత్రులు హాజరుకానున్నారు. ఆదేరోజు సాయంత్రం సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో వారందరితో కలిసి సిఎం కేసీఆర్‌ భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నారు. కనుక ఆ తర్వాత బిఆర్ఎస్‌ రాజకీయాలు వేగం పుంజుకోవచ్చు. 



Related Post