తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు: గవర్నర్‌

January 26, 2023


img

ఎంతో ఘనంగా, ఎంతో గర్వంగా నిర్వహించుకోవలసిన గణతంత్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్రంలో వివాదాస్పదమవడం చాలా బాధాకరం. ఈ వేడుకలని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించాల్సి ఉండగా కరోనా కారణంగా రాజ్‌భవన్‌లో జరుపుకోవాలని సూచించడంతో వివాదం మొదలైంది. సిఎం కేసీఆర్‌ 5 లక్షల మందితో ఖమ్మంలో బిఆర్ఎస్‌ బహిరంగసభ నిర్వహించినప్పుడు లేని కరోనా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడానికే అడ్డు వచ్చిందా? అనే గవర్నర్‌ ప్రశ్న సూటిగానే ప్రభుత్వ పెద్దలకి తగిలింది. దానికి తోడు గణతంత్ర దినోత్సవ వేడుకలని తప్పనిసరిగా ఘనంగా, పరేడ్‌తో సహా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడం పుండుమీద కారం చల్లిన్నట్లయింది. 

దాంతో బుదవారం సాయంత్రం హడావుడిగా ఏర్పాట్లు చేసి రాజ్‌భవన్‌లోనే నిర్వహించాల్సి వచ్చింది. ఈ వేడుకలకి ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు హాజరుకాకపోవడంతో మళ్ళీ గవర్నర్‌ విమర్శించడానికి అవకాశం కల్పించినట్లయింది. ఆమె సిఎం కేసీఆర్‌ని ఉద్దేశ్యించి చురకలు వేస్తే, మళ్ళీ బిఆర్ఎస్‌ నేతలు ఆమెకి ఘాటుగా బదులిచ్చారు.

వాటిపై మళ్ళీ ఆమె పుదుచ్చేరిలో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోందో రాష్ట్ర ప్రజలందరూ నిశితంగానే గమనిస్తున్నారు. రాజ్యాంగాన్ని, గవర్నర్‌ని, గణతంత్ర వేడుకలని, చివరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని కూడా పట్టించుకోని ప్రభుత్వం ఇది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలు వద్దనుకొంటే హైకోర్టు ఆదేశంతో చేయాల్సి వచ్చింది. ఆనవాయితీ ప్రకారం ముఖ్యమంత్రి ఈ వేడుకలకి హాజరు కావలసి ఉంది కానీ రాలేదు. కనీసం ప్రసంగ పాఠాన్ని కూడా పంపలేదు. కానీ హైకోర్టు చొరవతో ఈసారి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలని ప్రజలతో కలిసి జరుపుకోగలిగినందుకు చాలా సంతోషం కలిగింది,” అని అన్నారు.


Related Post