ఈటల బిజెపిలో ఉండలేకపోతున్నారు అందుకే...

January 26, 2023


img

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఈరోజు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “బిజెపిలో కోవర్టులున్నారని ఈటల రాజేందర్‌ అనడం చూస్తే ఆయన ఆ పార్టీలో ఇమడలేక ఇబ్బంది పడుతున్నారని అర్దం అవుతోంది. నిజానికి ఈటల, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలకి బిజెపి ఐడియాలజీ నచ్చదు. కానీ కేసీఆర్‌ని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతోనే వారు బిజెపిలో చేరారు. ఓ పార్టీ సిద్దాంతలతో, విధానాలతో కనెక్ట్ అవలేనప్పుడు ఎవరూ ఆ పార్టీలో మనుగడ సాగించలేరు. నిజానికి బిజెపి, బిఆర్ఎస్‌ మద్య అలాగే కేసీఆర్‌, ప్రధాని నరేంద్రమోడీల మద్య అండర్ స్టాండింగ్ ఉందనే విషయం వారికి ఆలస్యంగా అర్దమైనట్లుంది. ఇప్పుడు ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక ఈటల రాజేందర్‌ ఇబ్బంది పడుతున్నారు. అదే ఆయన మాటలలో బయటపడింది. కనుక ఆయన తన లక్ష్యసాధన కోసం మరో పార్టీ వెతుక్కోక తప్పదు,” అని అన్నారు. 

అసైన్డ్ భూముల కొనుగోలు కేసులలో చిక్కుకొన్న ఈటల రాజేందర్‌, బిజెపి వెనుక బలమైన కేంద్ర ప్రభుత్వం ఉంది గనుక దానిలో చేరితే కేసీఆర్‌ తన జోలికి రాకుండా ఉంటారనే ఉద్దేశ్యంతోనే దానిలో చేరి ఉండవచ్చు. అయితే బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు, ఆ పార్టీ పనిచేసేవిధానం చూస్తున్న ఈటల రాజేందర్, ఇప్పుడు బిజెపిలో ఉండలేకపోతున్నారనే ఊహాగానాలు చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆయనని పార్టీలో చేర్చుకొంటే టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నుంచి అనేకమంది నేతలనీ, ఎమ్మెల్యేలని బిజెపిలో ఆకర్షిస్తారనే భ్రమలు కూడా తొలగిపోవడంతో బిజెపి కూడా ఇప్పుడు ఆయనని పెద్దగా పట్టించుకోవడంలేదని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. కనుక ఈటల రాజేందర్‌ బిజెపిలో నుంచి బయటకి వచ్చేసే సమయం దగ్గర పడిందని రేవంత్‌ రెడ్డి జోస్యం చెపుతున్నారనుకోవచ్చు.


Related Post