రాజ్‌భవన్‌లోనే గణతంత్ర దినోత్సవాలు... సిఎం కేసీఆర్‌ డుమ్మా!

January 26, 2023


img

ఈసారి కూడా రాజ్‌భవన్‌లోనే గణతంత్ర దినోత్సవాలు వేడుకలు జరిగాయి. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ త్రివర్ణ పతాకం ఎగురవేసి వేడుకలని ప్రారంభించారు. హైకోర్టు ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా రాజ్‌భవన్‌లోనే పోలీస్ బలగాలతో పరేడ్ నిర్వహించింది. ఈ వేడుకలకి సిఎం కేసీఆర్‌, మంత్రులు ఎవరూ హాజరుకాలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఎస్ శాంతి కుమారి, డిజిపి అంజని కుమార్‌ తదితరులు మాత్రం హాజరయ్యారు. తమిళిసై సౌందరరాజన్‌ కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు కనుక  గణతంత్ర వేడుకలు ముగియగానే హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో పుదుచ్చేరి బయలుదేరి వెళ్లారు.   

గవర్నర్‌ తన ప్రసంగంలో తెలంగాణ, హైదరాబాద్‌ చారిత్రక గొప్పదనం, సమ్మక్కసారలమ్మ పండుగల వైశిష్ట్యంల గురించి అభివర్ణిస్తూనే అభివృద్ధి అంటే ఎత్తైన భవనాలు కట్టుకోవడం కాదని, జాతి నిర్మాణమని సిఎం కేసీఆర్‌కి సున్నితంగా చురకలు వేశారు. అంబేడ్కర్ వంటి ఎందరో మేధావులు, మహానుబావులు రాజ్యాంగాన్ని రచించారని, ఆ రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ఏర్పడిందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చెప్పడం కూడా కేసీఆర్‌ని ఉద్దేశ్యించే అని వేరే చెప్పక్కరలేదు. గత ఏడాది ప్రెస్‌మీట్‌లో రాజ్యాంగాన్ని మార్చాలని సిఎం కేసీఆర్‌ గట్టిగా నొక్కి చెప్పారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న తన పట్ల సిఎం కేసీఆర్‌ చాలా అనుచితంగా వ్యవహరిస్తున్నారని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఈవిదంగా మరోసారి గుర్తుచేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలని సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించకపోగా కనీసం రాజ్‌భవన్‌లో జరిగిన వేడుకలకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరుకాకపోవడాన్ని ప్రతిపక్షాలు కూడా తప్పు పడుతున్నాయి. 


Related Post