కేసీఆర్‌కి గణతంత్ర వేడుకలు నిర్వహించాలనే ఆసక్తి లేదా?

January 25, 2023


img

తెలంగాణలో కరోనా నెలకొని ఉన్న కారణంగా ఈ ఏడాది రాజ్‌భవన్‌లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కి లేఖ వ్రాసింది. దీనిపై అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో నేడు లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలైంది. దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా గణతంత్ర దినోత్సవ వేడుకలని ఘనంగా నిర్వహించాల్సిందే అని ఆదేశించింది. అదీ... పరేడ్‌తో ఘనంగా నిర్వహించాలని ఆదేశించింది.

గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ ప్రజలలో జాతీయ భావం దేశభక్తి పెంచే జాతీయ పండుగ అని కనుక ఎట్టి పరిస్థితులలో వాటిని ఘనంగా నిర్వహిచాల్సిందే అని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గణతంత్ర దినోత్సవ వేడుకలకి సంబందించి కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. అయితే పరేడ్‌ ఎక్కడ నిర్వహించాలో ప్రభుత్వమే నిర్ణయించుకోవచ్చని తెలిపింది. 

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్‌కి హైకోర్టు చురకలు కూడా వేసింది. రాష్ట్రంలో కరోనా ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు విధించింది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకొంటోందో చెప్పగలరా?గణతంత్ర దినోత్సవ వేడుకలని మొక్కుబడిగా రాజ్‌భవన్‌లో నిర్వహించుకోవలసిన అవసరం ఏమిటని గట్టిగా నిలదీసింది. 

దీంతో రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగాగణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకోక తప్పడం లేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలని నిర్వహించడానికి ఎందుకు వెనకాడుతోంది?అంటే సిఎం కేసీఆర్‌కి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో విరోదమే కారణంగా కనిపిస్తోంది. కానీ గణతంత్ర దినోత్సవ వేడుకలని నిర్వహించడానికి ప్రభుత్వం వెనకాడుతుండటం ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపుతోంది. ప్రతిపక్షాలు వేలెత్తి చూపి విమర్శించడానికి అవకాశం కల్పిస్తోంది కూడా. 


Related Post