మళ్ళీ గవర్నర్‌-ప్రభుత్వం మద్య యుద్ధవాతావరణం

January 24, 2023


img

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్ర ప్రభుత్వం మద్య మళ్ళీ ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. మరో రెండు రోజులలో గణతంత్ర దినోత్సవం ఉంది. ఏటా సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి. ఆనవాయితీ ప్రకారం గవర్నర్‌ త్రివర్ణ పతాకం ఎగురవేసిన తర్వాత రాష్ట్ర పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. తర్వాత రాష్ట్ర ప్రజలని ఉద్దేశ్యించి ప్రసంగించడం ఆనవాయితీ. 

గవర్నర్‌ చేతుల మీదుగా ఈ వేడుకలు ప్రారంభించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి సమాచారం అందకపోవడంతో, ఈసారి కూడా రాజ్‌భవన్‌లోనే అధికారులు, సిబ్బంది సమక్షంలో గవర్నర్‌ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. 

ఫిభ్రవరి 3వ తేదీ నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆనవాయితీ ప్రకారం బడ్జెట్‌ సమావేశాల ముందు రాష్ట్ర గవర్నర్‌ ఉభయ సభల సభ్యులని ఉద్దేశ్యించి ప్రసంగించడంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉండగా ఈసారి కూడా ఆమెని ఆహ్వానించకుండా, ఆమె ప్రసంగం లేకుండానే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

గత సంవత్సరం సెప్టెంబర్‌ 13వ తేదీన 8 బిల్లులని శాసనసభలో ఆమోదించి గవర్నర్‌ ఆమోదం కోసం పంపగా వాటిని ఆమె ఆమోదించకుండా పరిశీలన పేరుతో పక్కన పెట్టేశారని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ ఓ లేఖ వ్రాసింది. గవర్నర్‌ వాటిని తక్షణం ఆమోదించాలని ఆదేశించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేసింది. 

రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ని గౌరవించదు పట్టించుకోదు. కనుక ఆమె కూడా తనవద్దకి వచ్చిన బిల్లులకి ఆమోదం తెలుపకుండా పక్కన పెడుతున్నారు. కనుక ఈ పంచాయతీ ఇప్పట్లో తేలేది కాదని చెప్పవచ్చు.


Related Post