స్మితా సభర్వాల్ ట్వీట్... కేసీఆర్‌ ప్రభుత్వానికే తగిలిన బాణం?

January 23, 2023


img

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా చేస్తున్న ఐఏఎస్ అధికారిని స్మితా సభర్వాల్ ఇంట్లోకి గురువారం అర్దరాత్రి మేడ్చల్ జిల్లా డెప్యూటీ తహశీల్దార్ చెరుకు ఆనంద్ కుమార్‌ రెడ్డి ప్రవేశించారు. రాత్రి సుమారు 11.30 గంటలకి ఆయన తన స్నేహితుడైన కొత్తబాబుతో కలిసి స్మితా సభర్వాల్ నివసించే జూబ్లీహిల్స్‌ చేరుకొన్నారు. అక్కడ ప్లజెంట్ వ్యాలీలోని బి-17కి వెళుతున్నామని సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి వారిద్దరూ కారులో స్మితా సభర్వాల్ నివశిస్తున్న బీ-11 బంగ్లా వద్దకి చేరుకొన్నారు. 

 కొత్తబాబు కిందన కారులోనే ఉండగా ఆనంద్ కుమార్‌ రెడ్డి “నేను మీ ఇంటి గుమ్మం వద్దే ఉన్నాను,” అని ఆమెకి ట్వీట్ చేసి, వెంటనే ఇంట్లోకి ప్రవేశించి మొదటి అంతస్తులో ఉన్న ఆమె గదికి వెళ్ళి తలుపు తట్టారు. ఆ సమయంలో అతనిని చూసి ఆమె చాలా కంగారు పడ్డారు. కానీ వెంటనే తేరుకొని పోలీసులకి ఫోన్‌ చేసారు. ఈలోగా సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి వచ్చి ఆయనని కిందన కారులో కూర్చొని ఎదురుచూస్తున్న కొత్తబాబుని పట్టుకొని అక్కడకి చేరుకొన్న జూబ్లీహిల్స్‌ పోలీసులకి అప్పగించారు. 

పోలీసులు వారిరువురినీ అదుపులో తీసుకొని వారిపై కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా వారికి 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. 

ఈ ఘటనపై స్మితా సభర్వాల్ స్పందిస్తూ, “అర్దరాత్రి పూట ఓ వ్యక్తి నా ఇంట్లో ప్రవేశించడంతో చాలా భయమేసింది. అయితే వెంటనే పోలీసులకి ఫోన్‌లో చేసి నా ప్రాణాలు కాపాడుకొన్నాను. దీని వలననేర్చుకొన్న రెండు గుణపాఠాలు: మీ ఇంటికి ఎంత భద్రత ఉందని మీరు భావిస్తున్నప్పటికీ, ఎల్లప్పుడూ మీ ఇంటి తలుపులన్నీ వేశారా లేదా వాటిని లాక్‌ చేశారా లేదా అని చూసుకోవాలి. అలాగే ఇటువంటి ఆపత్సమయంలో వెంటనే డయల్ 100కి ఫోన్‌ చేసి పోలీసుల సాయం కోరాలి,” అని స్మితా సభర్వాల్ ట్వీట్ చేశారు. 

       

అర్దరాత్రి పూట ఓ అపరిచుతుడు ఇంట్లో ప్రవేశించి తన గుమ్మం ముందు నిలుచొంటే ఎవరైనా షాక్ అవుతారు. అయితే పటిష్టమైన భద్రత ఉన్న ఆమె ఇంట్లోకి ఆనంద్ కుమార్‌ రెడ్డి ఎలా చొరబడ్డాడు?అసలు ఓ ఉన్నత పదవిలో ఉన్న ఆయన ఎందుకు ఆ సమయంలో ఆమె ఇంట్లోకి ప్రవేశించారు?మద్యం సేవించి ఆమె ఇంట్లో ప్రవేశించారా?అనే ప్రశ్నలకి పోలీసులు సమాధానాలు చెపుతారు. కానీ ఆమె ఆందోళనతో పోస్ట్ చేసిన ఈ ట్వీట్ ప్రతిపక్షాలు ఆయుధంగా అందిపుచ్చుకొన్నాయి. 

పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆమె ట్వీట్‌పై స్పందిస్తూ, “కేసీఆర్ పాలనలో మినిమమ్ గవర్నెన్స్ మ్యాగ్జిమమ్ పాలిటిక్స్ ఫలితం ఇది. సింగరేణి కాలనీలో ఆరేళ్ల పసిబిడ్డకే కాదు… ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసే మహిళా ఉన్నతాధికారిణికీ భద్రత లేని పాలనలో ఉన్నాం. ఆడబిడ్డలూ… తస్మాత్ జాగ్రత్త!” అంటూ రీట్వీట్ చేశారు. Related Post