కలిసి పనిచేద్దాం కానీ ముందు కోమటిరెడ్డిని బయటకి పంపండి!

January 21, 2023


img

కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గత ఏడాదిన్నరగా పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మీద కత్తులు దూస్తూనే ఉన్నారు. దాంతో రేవంత్‌ రెడ్డి కూడా ధీటుగా జవాబు చెప్పక తప్పలేదు. ఈ గొడవల కారణంగానే మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దీంతో కాంగ్రెస్‌ అధిష్టానం మాణిక్‌రావు థాక్రేని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఆయన వచ్చీరాగానే మొట్టమొదట కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, రేవంత్‌ రెడ్డికి మద్య రాజీ కుదిర్చారు. ఆయన గట్టిగా చెప్పడంతో ఈరోజు ఇద్దరూ కలిసి మీడియా ముందుకు వచ్చి ఇకపై కలిసి పనిచేస్తామని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి గట్టిగా కృషి చేస్తామని చెప్పారు. కనుక మాణిక్‌రావు థాక్రే తొలి ప్రయత్నం ఫలించిన్నట్లయింది.

అయితే మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్‌ నాయకురాలు కొండా సురేఖ భిన్నంగా స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ, “ఇంతకాలం కుమ్ములాడుకోవడం వలననే ప్రతీ ఎన్నికలలో ఓడిపోతున్నాము. కనుక ఇకనైనా అందరం కలిసికట్టుగా పనిచేద్దాము. అయితే ముందుగా పార్టీకి తీరని నష్టం, ద్రోహం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పార్టీ నుంచి బయటకి సాగనంపాలి. అటువంటివారి వలననే పార్టీ నష్టపోతోంది,” అని అన్నారు. 

కొండా సురేఖ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీటుగా స్పందిస్తే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో గొడవలు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.


Related Post