కేసీఆర్‌ కాంగ్రెస్‌ మిత్రపక్షాలని హైజాక్ చేస్తున్నారా?

January 21, 2023


img

సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌ మిత్రపక్షాలని హైజాక్ చేస్తున్నారా?అంటే అవుననే అంటున్నారు పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి. శుక్రవారం గాంధీ భవన్‌లో పార్టీ సీనియర్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రంలో మళ్ళీ బిజెపి అధికారంలో వచ్చేందుకు ఉత్తరాది రాష్ట్రాలలో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌కి, దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్‌ మిత్రపక్షాలని, లౌకికవాదులని చీల్చే బాధ్యతని సిఎం కేసీఆర్‌కి ప్రధాని నరేంద్రమోడీ అప్పగించారు. మొన్న ఖమ్మం సభ కూడా దానిలో భాగమే. ప్రధాని నరేంద్రమోడీకి కేసీఆర్‌కి, బిఆర్ఎస్‌, బిజెపిల మద్య రహస్యఅవగాహన ఉంది. బిఆర్ఎస్‌, మజ్లీస్ పార్టీలు రెండూ బిజెపికి బీ-టీమ్స్. వాటి లక్ష్యం కాంగ్రెస్‌ మిత్రపక్షాలని, కాంగ్రెస్‌ ఓట్లని చీల్చి బిజెపి మళ్ళీ అధికారంలోకి వచ్చేలా చేయడమే,” అని అన్నారు. 

రేవంత్‌ రెడ్డి వాదనలో బిజెపి, బిఆర్ఎస్‌ మద్య రహస్య అవగాహన ఉందా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే, కేసీఆర్‌ మొట్టమొదట కాంగ్రెస్‌ మిత్రపక్షాలనే ఆకర్షిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. అఖిలేశ్ యాదవ్ (యూపీ), ఉద్ధవ్ థాక్రే (మహారాష్ట్ర), శరద్ యాదవ్ (మహారాష్ట్ర), కుమారస్వామి (కర్ణాటక), స్టాలిన్ (తమిళనాడు), హేమంత్ సొరేన్ (ఝార్ఖండ్) వంటివారందరూ కాంగ్రెస్‌తో కలిసి పనిచేసినవారే. ఇప్పుడు వారందరూ కేసీఆర్‌ పక్షంలో చేరుతుండటం గమనిస్తే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్‌ ఒంటరి కాబోతోందని అర్దం అవుతుంది. 

ఆయన కాంగ్రెస్‌ మిత్రపక్షాలని ఆకర్షించడమే కాదు... వాటి ద్వారా ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుని కూడా కొల్లగొట్టబోతున్నారన్న మాట! ఇప్పటికే చాలా బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నుంచి మిత్రపక్షాలు కూడా దూరమై, దాని ఓటు బ్యాంకుని కూడా కోల్పోతే ఇక అది ఎన్నటికీ కోలుకోలేదు. 

కేసీఆర్‌ తొలి ప్రయత్నంలో ప్రధానమంత్రి అవుతారో లేదో తెలీదు కానీ ఆయన రాజకీయాలతో కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు, వాటి ఓట్లు చీలిపోతే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బిజెపియే గెలిచి మళ్ళీ అధికారంలోకి రావడం తధ్యం. రేవంత్‌ రెడ్డి గంట మ్రోగిస్తూ కాంగ్రెస్‌ అధిష్టానాన్ని మేల్కొలిపే ప్రయత్నం చేస్తున్నారు. మరి మేల్కొంటుందో లేదో?


Related Post