కామారెడ్డి పట్టణం అభివృద్ధి కోసం పురపాలక సంఘం రూపోదించిన మాస్టర్ ప్లాన్‌పై పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు చేపట్టి, రాజకీయంగా కూడా ఒత్తిడి పెంచడంతో దానిని రద్దు చేయక తప్పలేదు. అయితే కామారెడ్డితో పాటు జగిత్యాల మాస్టర్ ప్లాన్‌పై కూడా అప్పుడే వ్యతిరేకత, నిరసనలు మొదలయ్యాయి. కనుక ఈరోజు ఉదయం జగిత్యాల మున్సిపాల్ ఛైర్ పర్సన్ శ్రావని అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాస్టర్ ప్లాన్‌ని రద్దు చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. ఇంకా మరికొన్ని పురపాలక సంఘాలలో కూడా ఇదే సమస్య ఉంది. ఈ రెండు చోట్ల ఎదురైన వ్యతిరేకత, సమస్యలను దృష్టిలో ఉంచుకొని మిగిలిన పురపాలక సంఘాలు కూడా మాస్టర్ ప్లాన్‌పై వెనకడుగు వేస్తున్నాయి.
రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవడం ఓ కారణంకాగా, రైతులకి మద్దతుగా కాంగ్రెస్, బిజెపి నేతలు, కౌన్సిలర్లు కూడా ఆందోళనలో పాల్గొంటుండటం, రాజీనామాలు చేస్తుండటంతో ఈ సమస్య ప్రతిపక్షాలకి అస్త్రంగా అందిపుచ్చుకొంటున్నాయని బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా గ్రహించింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో వెనక్కి తగ్గవలసిరావడంతో రైతులకి అండగా నిలిచి పోరాడిన బిజెపి విజయం సాధించిన్నట్లయింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ మాస్టర్ ప్లాన్‌ల కారణంగా రైతులు పార్టీకి దూరమై, ప్రతిపక్షాలకి దగ్గరైతే రాజకీయంగా నష్టపోతామని బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నేతలు బాగానే గ్రహించారు. కనుక వారు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో బిఆర్ఎస్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అమలుపై పునరాలోచనలో పడింది. ఒకవేళ ఎక్కడైనా మాస్టర్ ప్లాన్ అమలుచేయాలని చూస్తే మళ్ళీ ఇదే పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది కనుక ఇకపై ఆచితూచి అడుగులువేయాల్సి ఉంటుంది.