కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేసిన్నట్లు తాజా సమాచారం. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించవలసి ఉంది. శుక్రవారం ఉదయం కామారెడ్డి పురపాలక సంఘం అత్యవసర సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో మాస్టర్ ప్లాన్ రద్దుకి ఆమోదముద్ర వేయడం ఖాయమని సమాచారం.
మాస్టర్ ప్లాన్‌లో కామారెడ్డి పట్టణాన్ని ఆనుకొని ఉన్న 8 గ్రామాలలో వ్యవసాయ భూములని పారిశ్రామికవాడగా మార్కింగ్ చేసినప్పటి నుంచి రైతులు ఆందోళన మొదలుపెట్టి అంచెలంచెలుగా ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి పెంచసాగారు, వారి ఒత్తిడి భరించలేక ఇద్దరు మునిసిపల్ కౌన్సిలర్లు రాజీనామాలు చేశారు... మరికొందరు రాజీనామాలకి సిద్దపడ్డారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కోరుతూ రైతులు కౌన్సిలర్ల ఇళ్ళని ముట్టడించి రాజీనామాలు చేయాలని ఒత్తిడి చేస్తుండటంతో వారు ప్రభుత్వంపై ఒత్తిడి చేసి చివరికి రద్దు చేయించిన్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం కామారెడ్డి పురపాలక సంఘం సమావేశం ముగిసిన తర్వాత దీనిపై అధికారిక ప్రకటన చేయవచ్చని సమాచారం. రైతులే కనుక కలిసికట్టుగా పట్టుబట్టి పోరాడకపోయి ఉంటే వారు శాస్వితంగా భూములు దాంతోపాటు తమ జీవనోపాధిని కూడా కోల్పోయేవారు. శక్తివంతమైన ప్రభుత్వంతో నిరుపేద రైతులు సమిష్టిగా పోరాడి విజయం సాధించడం మామూలు విషయం కాదు.