ఖమ్మం సభకి నాకు పిలుపు రాలేదు: నితీశ్ కుమార్‌

January 19, 2023


img

సిఎం కేసీఆర్‌ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలలో దేశవ్యాప్తంగా పర్యటించి పలువురు నేతలనీ కలిసి చర్చించారు. వారిలో బిహార్‌ సిఎం నితీశ్ కుమార్‌ కూడా ఒకరు. అయితే బుదవారం ఖమ్మంలో జరిగిన బిఆర్ఎస్‌ బహిరంగసభకి ఆయనని కేసీఆర్‌ ఆహ్వానించలేదు. 

ఇదే విషయమై విలేఖరులు నితీశ్ కుమార్‌ని ప్రశ్నించగా, “కేసీఆర్‌ అక్కడ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు సమాచారం లేదు. నన్ను ఆహ్వానించలేదు. ఒకవేళ పిలిచినా నేను వేరే కార్యక్రమాలతో చాలా బిజీగా ఉన్నందున ఆ సభకి వెళ్ళలేకపోయేవాడిని. ఏది ఏమైనప్పటికీ నాకు ఒకటే కార్యకర్తలు. ఎప్పటికైనా దేశంలో ప్రతిపక్షాలన్నీ కలిసి ముందుకు సాగాలని కోరుకొంటున్నాను,” అని అన్నారు. 

బిహార్‌, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు నితీశ్ కుమార్‌, మమతా బెనర్జీలు ప్రధానమంత్రి పదవి ఆశిస్తున్నారు. ఈ విషయం వారివారి పార్టీ ముఖ్య నేతల ద్వారా పలుమార్లు చెప్పించారు కూడా. సిఎం కేసీఆర్‌ కూడా ప్రధాని పదవి ఆశిస్తున్నారు. తాను ప్రధాని పదవి చేపడితేనే తాను కోరుకొన్నట్లు దేశంలో మార్పులుచేర్పులు చేయగలరు. కనుక ప్రధాని రేసులో ఉన్నవారితో ఆయన చేతులు కలపరు. తనని ప్రధాని అభ్యర్ధిగా, తన నాయకత్వాన్ని అంగీకరించేవారితోనే కేసీఆర్‌ చేతులు కలుపుతారు. 

కనుకనే నితీశ్ కుమార్‌, మమతా బెనర్జీలని ముందుగానే దూరం పెట్టిన్నట్లు భావించవచ్చు. ఇదీగాక కేసీఆర్‌ కాంగ్రెస్, బిజెపిలకి సమాన దూరం పాటించాలని అనుకొంటున్నారు. కానీ నితీశ్ కుమార్‌, మమతా బెనర్జీ ఇద్దరూ కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగాలనుకొంటున్నారు. కనుక కాంగ్రెస్‌ని వీడి తన నాయకత్వంలో పనిచేయడానికి సిద్దపడేవారికి మాత్రమే బిఆర్ఎస్‌లో చోటు లభిస్తుందని చెప్పవచ్చు. 


Related Post