సిఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆలోచన ప్రారంభించినప్పటి నుంచి ఆయన వెన్నంటి తిరిగినవారిలో కర్ణాటక మాజీ సిఎం, జేడీయు అధినేత కుమారస్వామి కూడా ఒకరు. హైదరాబాద్, ఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీ ఆవిష్కరణ కార్యక్రమాలకి కూడా ఆయన హాజరయ్యారు. అయితే నిన్న ఖమ్మంలో సిఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బిఆర్ఎస్ బహిరంగసభకి హాజరుకాలేదు. దీనిపై అప్పుడే విపక్షాలు రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.
మొదట కర్ణాటకలోనే బిఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కనుక తెలుగువారు ఎక్కువగా ఉండే ఆంధ్రా,తెలంగాణకి సరిహద్దు జిల్లాలోని బీదర్, గుల్బర్గా, రాయదుర్గ, కళ్యాణ కర్ణాటక, బళ్ళారి తదితర జిల్లాలో పోటీ చేయాలనుకోవడం సహజమే.
ఆ నియోజకవర్గాలలో కనీసం 25 సీట్లని, కొన్ని లోక్‌సభ సీట్లని కూడా బిఆర్ఎస్‌కి కేటాయించవలసిందిగా కేసీఆర్ కుమారస్వామిని కోరారని, కానీ అక్కడ జేడీయు కూడా చాలా బలంగా ఉన్నందున కుమారస్వామి అందుకు అంగీకరించలేదని, అందుకే కేసీఆర్ ఆయనని ఖమ్మం సభకి ఆహ్వానించలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కర్ణాటక శాసనసభలో మొత్తం 224 స్థానాలు ఉండగా వాటిలో కుమారస్వామి ఇప్పటికే 94 స్థానాలకి అభ్యర్ధులని ప్రకటించారు. ఇప్పుడు ఆ స్థానాలలో కొన్నిటిని బిఆర్ఎస్‌కి కేటాయించాలని కేసీఆర్ కోరితే అది సాధ్యం కాదు. కనుక కుమారస్వామి నిరాకరించి ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆ 25-30 నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ని దెబ్బతీసేందుకు కేసీఆర్ కర్ణాటకకి చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి రూ.500 కోట్లు ఆఫర్ చేశారంటూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడం గమనిస్తే కేసీఆర్-కుమారస్వామి మద్య సీట్ల పంపకంలో తేడా వచ్చి ఉండవచ్చనే అనుమానం కలుగుతోంది.
అయితే కాంగ్రెస్, బిజెపి నేతలు చేస్తున్న ఈ ఆరోపణలు, వాదనల సంగతి ఎలా ఉన్నా ఖమ్మం సభకి కుమార స్వామి ఎందుకు రాలేదో వారిరువురే చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ సీట్ల సర్దుబాటు కారణంగానే వారు దూరమయ్యుంటే, రేపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మిత్రపక్షాలతో కేసీఆర్‌కి ఇదే సమస్య ఎదురవుతుంది కదా?