తూచ్! నేను అలా అనలేదు: ఎర్రబెల్లి

January 19, 2023


img

తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్‌, కేటీఆర్‌ తర్వాత అంత ప్రాధాన్యం పొందుతున్న వ్యక్తి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌  రావు. ఆయన మొన్న మహబూబాబాద్ నరసింహులపేట మండలంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ప్రజలని ఉద్దేశించి మాట్లాడుతూ, “ఓ 20-25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చిన్నట్లయితే రాబోయే ఎన్నికలలో బిఆర్ఎస్‌ పార్టీ 100 సీట్లు గెలుచుకోవడం ఖాయం,” అని అన్నారు. ప్రతీ ప్రభుత్వానికి ప్రజలలో కాస్త వ్యతిరేకత సహజమని అన్నారు. ప్రజలు కేసీఆర్‌ని చూసే బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకి ఓట్లేస్తారని అయినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఓ 20-25 మందిని మార్చి 100 సీట్లు గెలుచుకోవచ్చని అన్నారు. నా ఎన్నికల సర్వేలు ఎన్నడూ తప్పు కాలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. 

ఆయన అన్న ఈ మాటలపై మీడియాలో రావడంతో రాజకీయ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. “బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల పట్ల ప్రజలలో వ్యతిరేకత నెలకొని ఉందని, రాబోయే ఎన్నికలలో 20-25 సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చకపోతే ఓటమి తప్పదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాటలే చెపుతున్నాయని కొందరు విశ్లేషించారు. 

కేసీఆర్‌కి సన్నిహితుడైన ఎర్రబెల్లి ఆయన మనసులో మాటనే బయటపెట్టారని కొందరు అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్ళీ టికెట్స్ ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చినప్పటికీ, ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకొనే కేసీఆర్‌ వారిలో 20-25 మందిని పక్కనపెట్టబోతున్నారని, అదే విషయం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు బయటపెట్టారని విశ్లేషించారు. దీంతో బిఆర్ఎస్‌ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఆందోళన మొదలై ఎర్రబెల్లి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

తాను చేసిన ఈ వ్యాఖ్యలు బెడిసికొట్టడంతో మంత్రి ఎర్రబెల్లి వెంటనే స్పందిస్తూ, “నేను అలాగ అనలేదు. రాబోయే ఎన్నికలలో బిఆర్ఎస్‌ పార్టీ 80 సీట్లు సాధించడం ఖాయమని, గట్టిగా కృషి చేస్తే మరో 20 సీట్లు సాధించవచ్చని మాత్రమే నేను అన్నాను తప్ప సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చాలని అనలేదు. నా మాటలని మీడియా వక్రీకరించింది,” అని అన్నారు. 


Related Post