బిఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాలలో ప్రవేశించబోతున్న సిఎం కేసీఆర్ ఈరోజు వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బిజెపియేతర నేతలతో ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నారు. ఈ సభకి సుమారు 5 లక్షల మందిని సమీకరించి అట్టహాసంగా సభ నిర్వహించి తన సత్తా చాటుకోవాలనుకొంటున్నారు. ఇందుకోసం మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాలవారీగా జనసమీకరణ చేసి ఖమ్మంకి తరలిస్తున్నారు.
ఇక సిఎం కేసీఆర్ దేశ్ కి నేత, కాబోయే ప్రధాని అంటూ పోస్టర్లు కూడా వెలిశాయి. . కేసీఆర్ స్వయంగా తాను ప్రధాని పదవి చేపట్టాలనుకొంటున్నట్లు చెప్పకపోయినా తన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల చేత నిత్యం చెప్పిస్తూనే ఉన్నారు. కనుక ఈరోజు జరుగబోయే సభకి హాజరయ్యే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర పార్టీల నేతల చేత “కేసీఆర్ తమ కూటమి ప్రధాని అభ్యర్ధి” అని ప్రకటింపజేయవచ్చని సమాచారం. ఈరోజు సభకి హాజరయ్యేవారెవరికీ ప్రధాని పదవి చేపట్టాలనే ఆశ, కోరిక రెండూ లేవు. ఒకవేళ ఉన్నా వారికి అంత శక్తి సామర్ధ్యాలు లేవు కనుక కేసీఆర్‌ని తమ ప్రధానమంత్రి అభ్యర్ధి అని ప్రకటించడానికి వారికేమీ అభ్యంతరం ఉండకపోవచ్చు. ఇది నిజమో కాదో మరికొన్ని గంటలలో తేలిపోతుంది.
ఒకవేళ ఇదే నిజమైతే, బిఆర్ఎస్ మొట్ట మొదటిసభలోనే కేసీఆర్ ప్రధానిగా ప్రకటింపజేసుకోవడం తొందరపాటు అనుకోవచ్చు లేదా ఇంకా బిహార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ తదితరులు కూడా ప్రధాని రేసులో ఉన్నారు కనుక కేసీఆర్ ముందస్తు జాగ్రత్తగా ఇప్పుడే ప్రకటింపజేసుకొంటున్నారని అనుకోవచ్చు.