మూడు యుద్ధాలతో గుణపాఠం నేర్చుకొన్నాం: పాక్ ప్రధాని

January 17, 2023


img

ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్ధిక, ఆహార సంక్షోభంలో చిక్కుకొని విలవిలలాడుతోంది. అప్పులు, ఆర్ధిక సాయం కోసం ప్రపంచదేశాలని ప్రాధేయపడుతోంది. ప్రజలు గోధుమలు, కిరోసిన్, వంటగ్యాస్ వంటి నిత్యావసర వస్తువులు కొనుక్కోలేక అల్లాడిపోతున్నారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, భారత్‌ ప్రధాని నరేంద్రమోడీకి ఓ విజ్ఞప్తి చేశారు. 

“మేము భారత్‌టో మూడు యుద్ధాలు చేసి మంచి గుణపాఠాలు నేర్చుకొన్నాము. కనుక ఇకపై భారత్‌తో శాంతియుతంగా కొనసాగాలని కోరుకొంటున్నాము. కశ్మీర్ సమస్యపై నిజాయతీగా చర్చించి సమస్యని పరిష్కరించుకొందాము. ఈవిదంగా పరస్పరం ఘర్షణ పడుతూ సమయాన్ని, వనరులని వృధా చేసుకోకుండా రెండు దేశాల అభివృద్ధికి కృషి చేద్దాం. ఇకపై మారణాయుధాలపై మేము మా సొమ్ము వృదా చేసుకోదలచలేదు,” అని అన్నారు. 

భారత్‌, పాక్ రెండు దేశాలకి 1947లో ఆగస్ట్ 15వ తేదీన కొన్ని గంటల వ్యవధిలోనే స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నుంచి భారత్‌లో పాలకులు దేశాభివృద్ధి మీద దృష్టి పెట్టగా, పాక్ పాలకులు తమ దేశ సంపదని దోచుకోవడం, భారత్‌కి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంపైనే శ్రద్ద పెట్టారు. అందుకే పాక్ నేడు ఈ దుస్థితికి చేరుకొంది. 

ఇప్పుడు పాక్‌లో తీవ్ర ఆహార కొరత కూడా నెలకొని ఉంది కనుకనే పాక్ పాలకులు శాంతిమంత్రం పటిస్తున్నారని చెప్పవచ్చు. గుణపాఠం నేర్చుకొన్నామని చెపుతూనే కశ్మీర్ వివాదాస్పద అంశమే అని దానిపై చర్చిద్దామని పాక్ ప్రధాని చెప్పడం చూస్తే పాక్ ప్రభుత్వ ఆలోచనలలో, దాని వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదని అర్దం అవుతోంది. 

ఓ వైపు నేటికీ భారత్‌లోకి ఉగ్రవాదులని పంపిస్తూ విధ్వంసం సృష్టించే ప్రయత్నాలు చేస్తూనే, తమ సమస్యల నుంచి బయటపడేందుకు భారత్‌ తమకి సహకరించాలని పాక్ ప్రధాని కోరడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పాక్ సమస్యలకి పాక్ సైన్యాధికారుల యుద్ధ కాంక్ష, పాలకుల స్వార్ధమే కారణం. కనుక అవి మారనంతకాలం పాకిస్తాన్‌ని ఆ దేవుడు కూడా కాపాడలేడు.     



Related Post