యూపిలో అదే జరుగబోతోంది

October 22, 2016


img

యూపిలో అధికార యాదవ్ కుటుంబంలో పుట్టిన ముసలయం ఆ పార్టీని నాశనం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ముందు ఊహించినట్లే, అధికార సమాజ్ వాదీ పార్టీ నిలువునా రెండుగా చీలే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అది స్వయంగా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వలన జరుగుతుండటమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ పార్టీలో తండ్రి, కొడుకు, బాబాయ్, కొత్తగా ఎంట్రీ ఇచ్చిన సవతి తల్లి మధ్య జరుగుతున్న అంతర్యుద్ధాలు పతాకస్థాయికి చేరుకొన్నాయి. దానితో అఖిలేష్ యాదవ్ పార్టీని నిలువునా చీల్చి కొత్త పార్టీ పెట్టుకోవడానికి సిద్దం అవుతున్నారు. దానికి జాతీయ సమాజ్ వాదీ పార్టీ’ లేదా ‘ప్రగతిశీల్ సమాజ్ వాదీ పార్టీ’ అనే పేరు కూడా సిద్దం చేశారు. సమాజ్ వాదీ పార్టీ చిహ్నం సైకిల్ కనుక దానికంటే మరికొంచెం స్పీడుగా దూసుకుపోతానని చెప్పడానికి ఆయన మోటార్ సైకిల్ చిహ్నం ఎంచుకొన్నారు. ఇంతవరకు ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న అఖిలేష్ యాదవ్ ఈ మద్యనే దానిని నుంచి బయటకి వచ్చి తన అధికారిక నివాసంలోకి మారిపోవడం గమనిస్తే కుటుంబ కలహాలు చాలా తీవ్రస్థాయికి చేరినట్లు అర్ధం అవుతోంది. 

అసెంబ్లీ ఎన్నికల వ్యూహం గురించి చర్చించేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ నేతృత్వంలో నిన్న జరిగిన సమావేశానికి ముఖ్యమంత్రి హాజరుకాకుండా దానికి సమాంతరంగా తన నివాసంలో తన అనుచరులతో మరొక సమావేశం నిర్వహించారు. నవంబర్ 3నుంచి తను ప్రారంభించబోయే వికాస్ రధ యాత్ర గురించి దానిలో చర్చించినట్లు తెలుస్తోంది. విశేషం ఏమిటంటే అఖిలేష్ యాదవ్ ని పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించదానికి నిరాకరించినప్పటికీ, ఎన్నికల తరువాత మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారని శివపాల్ యాదవ్ నిన్న చెప్పారు. అది అఖిలేష్ ని చల్లబరిచి పార్టీ చీలిపోకుండా కాపాడేందుకేనని స్పష్టం అవుతోంది. కానీ అఖిలేష్ యాదవ్ మాత్రం స్వంత కుంపటి పెట్టుకోవడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. త్వరలోనే ఏ సంగతి తేలిపోవచ్చు. 

ములాయం తమ్ముడు శివపాల్ యాదవ్ కూడా చాలా కాలంగా ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి ఉన్నారు. ఆయన ఒత్తిడికి తలొగ్గి ములాయం సింగ్ రాష్ట్ర పార్టీ పగ్గాలు కూడా ఆయనకే అప్పగించారు. పైగా రెండో భార్య సాధనా గుప్తా కూడా అఖిలేష్ ని వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కనుక వారినిద్దరినీ కాదని ములాయం సింగ్ తన కొడుకుని మళ్ళీ చంకనెత్తుకోలేని పరిస్థితి. ఎత్తుకొంటే వారిరువురూ కలిసి పార్టీని చీల్చవచ్చు. ఎత్తుకోకపోతే కొడుకు చీల్చడానికి సిద్దంగా ఉన్నాడు. కనుక చీలిక అనివార్యంగానే కనిపిస్తోంది. కానీ వారందరూ గ్రహించని విషయం ఏమిటంటే, ప్రస్తుతం కుటుంబంలో, పార్టీలో, ప్రభుత్వంలో తమ మధ్య జరుగుతున్న ఈ గొడవల కారణంగా రాష్ట్ర ప్రజలు తమని చీధరించుకొంటున్నారని! కనుక వారు కలిసున్నా వేరు కుంపట్లు పెట్టుకొన్నా ఎవరూ గెలిచే అవకాశాలు ఉండకపోవచ్చు. వివిధ సర్వే ఫలితాలు కూడా అదే సూచిస్తున్నాయి.


Related Post