గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగి తర్వాత ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో కూడా అవమానకర పరిస్థితులు ఎదుర్కొంటున్నవారు బిఆర్ఎస్‌లో చాలా మందే ఉన్నారు. వారిలో కడియం శ్రీహరి కూడా ఒకరు. గత ప్రభుత్వంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా రెండు కీలకపదవులలో పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా మిగిలిపోగా, గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, వైద్యశాఖ మంత్రిగా కీలక పదవులు చేపట్టి అవినీతి ఆరోపణలతో రెండు పదవులూ పోగొట్టుకొన్న స్టేషన్‌ఘన్‌పూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రస్తుతం నియోజకవర్గంలో ఓ వెలుగు వెలుగుతుండటం విశేషం. ఇద్దరిదీ ఒకే నియోజకవర్గం కావడం, సహజంగా నోటి దురుసు కాస్త ఎక్కువ ఉన్న రాజయ్య తరచూ కడియం శ్రీహరిని ఉద్దేశ్యించి ఏదో మాట అంటుండటంతో ఇద్దరి మద్య తరచూ మాటల యుద్ధం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికలలో మళ్ళీ రాజయ్యకే టికెట్ లభించే అవకాశం కనిపిస్తుండటంతో కడియం శ్రీహరి తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్నారు.
కడియం శ్రీహరి నిన్న మీడియాతో మాట్లాడుతూ, “సుమారు నాలుగు దశాబ్ధాలుగా నేను రాజకీయాలలో ఉన్నాను. కానీ ఏనాడూ పదవుల కోసం ఎవరి ముందు తలవంచలేదు. ఎవరి కాళ్ళు మొక్కలేదు. ఆ అవసరం లేదు కూడా. నాకు ఏం వచ్చినా అది నా సమర్దతతో వచ్చినవే. మనిషన్నాక ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉండాలి. ఆ రెండూ లేనివాడు మనిషే కాడు,” అని అన్నారు.
సిఎం కేసీఆర్ ఇటీవల పార్టీ సమావేశంలో ఈసారి కూడా మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకె టికెట్స్ ఇస్తామని చెప్పడంతో కడియం శ్రీహరికి ఈసారి కూడా టికెట్ లభించదని స్పష్టమవుతోంది. కనుక ఇటు పార్టీలో, ప్రభుత్వంలో కూడా తనకి ఎటువంటి ప్రాధాన్యం లభించకపోగా, రాజయ్య చేతిలో అవమానాలు భరించాల్సి వస్తోందనే అసంతృప్తి ఆయన మాటలలో వినిపిస్తోంది.