గత శాసనసభ ఎన్నికలలో తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయినప్పటి నుంచి కేసీఆర్ ఆయనని పట్టించుకోకపోవడంతో ఇంతకాలం ఓపికగా ఎదురుచూశారు. చివరికి వేరే పార్టీలో చేరేందుకు సిద్దపడుతుండగా, సిఎం కేసీఆర్ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్‌లని ఆయన వద్దకి పంపించి బుజ్జగించారు. వారితో పాటు తుమ్మలని తీవ్రంగా విమర్శించిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా తుమ్మల నివాసానికి వెళ్లారు.
మంత్రి హరీష్ రావు వారిరువురికీ రాజీ కుదిర్చి, పార్టీలో తగిన గౌరవం, ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇవ్వడంతో తుమ్మల నాగేశ్వరరావు చల్లబడ్డారు. ఈ నెల 18న సిఎం కేసీఆర్ అధ్వర్యంలో ఖమ్మంలో జరిగే బిఆర్ఎస్ బహిరంగసభలో పాల్గొంటానని, దానిని విజయవంతం చేయడానికి తాను కృషి చేస్తానని తుమ్మల వారికి హామీ ఇచ్చారు.
ఈరోజు ఉదయం సత్తుపల్లిలో తన అనుచరులతో సమావేశమయ్యి బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగాలనుకొంటున్నానని స్పష్టం చేశారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇదేవిదంగా యావత్ దేశాన్ని అభివృద్ధి చేయడానికి కేసీఆర్ నడుం బిగించారని ఆయనకి మనం అందరం అండగా నిలబడుదామని అన్నారు.
కనుక మంత్రి హరీష్ రావు రాయబారం ఫలించిందని అర్దమవుతోంది. అయితే ఖమ్మంలో తుమ్మలని బుజ్జగించిన మంత్రి హరీష్ రావు బృందం, ఖమ్మంకే చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ వీడేందుకు సిద్దమవుతున్నా పట్టించుకోలేదు. కనుక ఆయనని వదులుకోవాలని కేసీఆర్ నిర్ణయించిన్నట్లు అర్దమవుతోంది. కనుక ఆయన ఈ నెల 18, 19 తేదీలలో ఏదో ఓ రోజు బిజెపిలో చేరడానికి సన్నాహాలు చేసుకొంటున్నారు.